iDreamPost

ముదురుతున్న వివాదం.. కేజ్రీవాల్‌ ఇంటి గేటుకు కాషాయం

ముదురుతున్న వివాదం.. కేజ్రీవాల్‌ ఇంటి గేటుకు కాషాయం

ఆయనో రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఇంటిపైనే దాడి జరిగింది. ఇంటి గేట్లను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలను పగలగొట్టారు. ఆ ఇంటి గేటుకు కాషాయ రంగు పూశారు. దేశ రాజధాని, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఢిల్లీలో చోటుచేసుకున్న విధ్వంసం ఇది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఎంపీ ఆధ్వర్యంలో ఇదంతా జరగడం ఆలోచించాల్సిన విషయం.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంపై బుధవారం బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. బాలీవుడ్‌ సినిమా ‘కశ్మీర్‌ ఫైల్స్‌’పై కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేవైఎం అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఢిల్లీ సీఎం నివాసం వద్దకు ర్యాలీగా వచ్చారు. ఎంపీ తేజస్వి సూర్య ఏకంగా కేజ్రీవాల్‌ ఇంటి గేటుపైకి ఎక్కారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాకు వినోదపన్ను మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా కశ్మీర్‌లో హిందువుల ఊచకోతను కేజ్రీవాల్‌ ఎగతాళి చేశారని అన్నారు.

కేజ్రీవాల్‌ ఇటీవల ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. కశ్మీర్‌ ఫైల్స్‌ ఒక బూటకపు సినిమా అన్నారు. ఆ సినిమాకు పన్ను మినహాయించాలని బీజేపీ కోరడాన్ని తప్పుబట్టారు. ఆ సినిమాకు చాలా రాష్ట్రాలు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడాన్నీ తప్పుబట్టారు. ముందుగా సినిమాను ప్రమోట్‌ చేయడాన్ని బీజేపీ మానుకొని, కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పించాలని అన్నారు. సినిమాను అందరికీ చూపించాలని ఉంటే దానిని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిందిగా దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రికి సూచించాలని, తద్వారా ఉచితంగా చూడగలుగుతారని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌ చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. తన వ్యాఖ్యల ద్వారా కేజ్రీవాల్‌ ఉగ్రవాదుల వైపు ఉన్నట్లు స్పష్టమవుతోందని తేజస్వి సూర్య అన్నారు. ఆయన అర్బన్‌ నక్సలైట్‌గా మారారని ఆరోపించారు.

కేజ్రీవాల్‌ నివాసంపై బీజేపీ దాడి పట్ల ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్‌ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఆరోపించారు. ‘‘పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ను ఓడించలేక ఢిల్లీ సీఎంను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నింది. దుండగులను అడ్డుకోవాల్సిన పోలీసులే వారిని గేటు దగ్గరికి తీసుకొచ్చారు. పోలీసుల సంపూర్ణ సహకారంతోనే ఈ దాడి జరిగింది. బీజేపీ గూండాలు సీఎం ఇంటిపై దాడిచేసి సెక్యూరిటీ బారికేడ్లు, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. కేజ్రీవాల్‌ ప్రాణాలకు బీజేపీతో ముప్పు ఉంది’’ అని అన్నారు. దాడి దృశ్యాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి