iDreamPost

అధికారం.. అమెరికా అధ్యక్షుడు : ట్రంప్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు వ్యాఖ్యల వెనుక అర్థం ఏమిటి..?

అధికారం.. అమెరికా అధ్యక్షుడు : ట్రంప్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు వ్యాఖ్యల వెనుక అర్థం ఏమిటి..?

అధికారాన్ని బెల్లంతో పోలుస్తుంటారు. బెల్లం ఉంటనే ఈగలు.. అధికారం ఉంటేనే నేత చుట్టూ ప్రదక్షిణలు సర్వసాధారణంగా సాగుతుంటాయి. ఆ అధికారం పోయినప్పుడు అప్పటి వరకూ ఆ నాయకుడు వెంట తిరిగే వారు, మన పేరు ఆ నేత నోట పలికితే చాలు అనుకునే వారు కనిపించరు. గల్లీ నుంచి ఢిల్లీ వరకే కాదు.. దేశాధినేతలకు ఈ సూత్రం వర్తిస్తుందని అమెరికా ఎన్నికల సాక్షిగా మరోమారు రుజువైంది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ మంచి స్నేహితులనే టాక్‌ ఉంది. మోదీ అమెరికా వెళ్లినప్పుడు అక్కడ ప్రవాస భారతీయులతో నిర్వహించిన సభకు మోదీతో కలసి ట్రంప్‌ హాజరయ్యారు. ట్రంప్‌ భారత్‌ పర్యాటనకు వచ్చిన సమయంలో.. నమస్తే ట్రంప్‌ అనే పేరు భారీ కార్యక్రమం నిర్వహించిన మోదీ.. ట్రంప్‌కు ఘన స్వాగతం పలికారు. ఒకరునొకరు ప్రశంసలతో ముంచెత్తుకున్నారు. ఇది గతం.

మోదీ, ట్రంప్‌లు మంచి స్నేహితులు అనుకునే వారిని ఆశ్చర్యంలో ముంచెత్తేలా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్రంప్‌ పరిపాలనపై విమర్శలు చేశారు. కరోనాను ట్రంప్‌ సమర్థవంతంగా అరికట్టలేకపోవడం వల్లనే అధ్యక్ష ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చాయని విమర్శించారు. కోవిడ్‌ నియంత్రణలో ట్రంప్‌ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కోవిడ్‌ వల్ల అమెరికా పౌరులు భారీ సంఖ్యలో మరణించారని నడ్డా పేర్కొన్నారు. అదే సమయంలో భారత్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం కరోనాను సమర్థవంతగా నిలువరించిందని నడ్డా పేర్కొన్నారు. తన పరిపాలన సమర్థతతో మోదీ 130 కోట్ల భారతీయులను కోవిడ్‌ నుంచి రక్షించారని కొనియాడారు.

బిహార్‌ మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్నాలో మాట్లాడిన నడ్డా.. మోదీని పొగుడుతూ.. ట్రంప్‌ను విమర్శించడం ఇప్పటి వరకూ మోదీ, ట్రంప్‌లు స్నేహితులనుకున్న వారిలో కొత్త చర్చకు తెరతీసింది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి వైపు పయనిస్తుండగా.. అతని ప్రత్యర్థి జో బైడెన్‌ విజయానికి సమీపంలో ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ ట్రంప్‌తో స్నేహం చేసేందుకు ఆసక్తి చూపిన నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు.. నేడు ట్రంప్‌కు అధికారం దూరం అయ్యే పరిస్థితి రావడంతో స్వరం మార్చడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి