iDreamPost

సెంటిమెంటు వర్షంలో తడిసిన హౌస్

సెంటిమెంటు వర్షంలో తడిసిన హౌస్

ఇవాళ బిగ్ బాస్ అంకంలో మరో వీకెండ్ వచ్చేసింది. నాగార్జున ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఎవరి ఎలిమినేషన్ ఉంటుందనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిన్న హౌస్ సభ్యులు కావాల్సినంత సెంటిమెంట్ వర్షం కురిపించారు. తమ జీవితంలో బాగా ఎమోషనల్ గా అనిపించిన సందర్భాలను షేర్ చేసుకునే క్రమంలో ఎవరికీ తెలియని విషయాలు చెప్పుకున్నారు. అవినాష్ మాట్లాడుతూ లాక్ డౌన్ కు ముందు అమ్మానాన్నాల కోసం ఓ ఇల్లు లోన్ లో కొన్నాక ఇద్దరికీ అనారోగ్య సమస్యలు తలెత్తాయని పది లక్షల దాకా ఖర్చు చేశాక చేతిలో డబ్బులు అయిపోయి ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పుకొచ్చాడు. అయితే ధైర్యం కోల్పోకుండా పరిస్థితులకు ఎదురు నిలిచి ఇప్పుడు ఇలా మీ ముందు ఉన్నానని చెప్పుకొచ్చాడు.

ఇక గంగవ్వ తన చిన్న కూతురు ఫిట్స్ వల్ల చనిపోయినప్పుడు పడిన యాతన వర్ణించినప్పుడు పార్టిసిపెంట్స్ అందరూ భోరున ఏడ్చేశారు. లాస్య తనకు బాబు పుట్టినప్పుడు కలిగిన ఫీలింగ్స్ పంచుకుంది. ఇవన్నీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించినవి కావడంతో వాళ్ళను అమితంగా ఇష్టపడే అభిమానులను భావోద్వేగాలకు గురి చేశాయేమో కానీ సగటు ప్రేక్షకులకు మాత్రం ఏమంత గొప్పగా అనిపించని మాట వాస్తవం. లాస్య చెప్పిన ఎపిసోడ్ పెళ్ళై పిల్లలున్న ప్రతి ఒక్క స్త్రీకు అనుభవమయ్యేదే కాబట్టి ఇదంతా ఒక రొటీన్ వ్యవహారమే అని చెప్పాలి. అవినాష్ బిగ్ బాస్ గొంతును ఇమిటేట్ చేస్తూ ఇచ్చిన మిమిక్రీ బాగానే పేలింది. హారిక, నోయెల్, అమ్మ, లాస్య, దివిలతో ప్లే చేసిన కామెడీ పండింది. అవినాష్, అమ్మ రాజశేఖర్ లు మరో సారి పాటలు పడుతూ అఖిల్, దివిలను టార్గెట్ చేయడం వినోదాన్ని పంచింది.

ఇలా నవ్వులు, కన్నీళ్ల డ్రామాతో ఎపిసోడ్ మొత్తం ఓ మాదిరిగానే సాగింది. ఇవాళ హౌస్ నుంచి ఎవరు బయటికి వస్తారో వేచి చూడాలి. అసలే ఐపిఎల్ దెబ్బకు సోషల్ మీడియాలో బిగ్ బాస్ హంగామా చాలా తగ్గింది. మ్యాచులు చాలా రసవత్తరంగా సాగుతుండటంతో మేమ్స్ పేజెస్ టోర్నమెంట్ కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. నెటిజెన్లు కూడా వాటి మీద తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులు షో ఎలాంటి మలుపులు తిరగబోతోందన్నది చాలా కీలకం. వైల్డ్ డాగ్ ఫారిన్ షెడ్యూల్ వల్ల కొన్ని ఎపిసోడ్లు నాగార్జున బదులు రమ్యకృష్ణ వస్తారని జరుగుతున్న ప్రచారానికి కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా రెండు నెలలకు పైగా సాగాల్సిన బిగ్ బాస్ గేమ్ లో ఇకపై ఎలాంటి ఆటలు ఆడించబోతున్నారో, ఎత్తులు వేయించబోతున్నారో. వైల్డ్ కార్డు ఎంట్రీలుగా ఎవరు రాబోతున్నారో వేచి చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి