iDreamPost

కొత్త కెప్టెన్ అవినాష్ : రేషన్ పరేషాన్

కొత్త కెప్టెన్ అవినాష్ : రేషన్ పరేషాన్

పడుతూ లేస్తూ సాగుతున్న బిగ్ బాస్ 4 వ్యవహారం రాను రాను చప్పగా మారుతోంది. చిత్ర విచిత్రమైన టాస్కులైతే ఇస్తున్నాడు కానీ కొన్ని వెరైటీగా అనిపిస్తుండగా మరికొన్ని మాత్రం సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఇంకా సిరీస్ సగం కూడా కాలేదు. మరో యాభై రోజులకు పైగా నడపాల్సి ఉంది. వైల్డ్ కార్డు ఎంట్రీలు లేవు. సెలెబ్రిటీలు రావడం లేదు. కొత్త సినిమాల రిలీజులు లేవు కాబట్టి ఆ యూనిట్లు వచ్చి సందడి చేసే ఛాన్స్ లేదు. ఎంతసేపూ సభ్యుల మధ్య డ్రామాను పండించి ప్రేక్షకులను మెప్పించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకే రకరకాల గేమ్స్ ఎన్ని ఆడిస్తున్నా, పార్టిసిపెంట్స్ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా గత సీజన్ తరహాలో ఇప్పుడీ బిగ్ బాస్ లేదన్నది వాస్తవం.

ఇక నిన్న ఎపిసోడ్ విషయానికి వస్తే కొత్త కెప్టెన్ గా అవినాష్ ఎంపికయ్యాడు. బండి తోయరా బాబు అనే పోటీ పెట్టి తనకు అరియనాను కాంపిటీషన్ కు దింపాడు. ఇందులో భాగంగా ఇద్దరికీ చెరొక స్టేషన్ తో పాటు రెండు రెండు ట్రాలీలు కూడా ఇచ్చారు. ఫైనల్ గా టాస్క్ పూర్తయ్యేలోగా ఎవరైతే స్టేషన్ లో ఎక్కువ పార్టిసిపెంట్స్ ని ఉంచగలగుతారో వాళ్లే కెప్టెన్ అవుతారన్న మాట. ఇది జరగాలంటే హౌస్ మేట్స్ ని ఒప్పించి తమతో వచ్చేలా చేసుకోవాలి. ఒకదశలో ఇద్దరూ ఐదేసి పాయింట్లతో సమానంగా నిలిచారు. కొంత నాటకీయత తర్వాత మోనాల్ అరియనా వైపు నుంచి అవినాష్ వైపు వెళ్ళిపోవడంతో అతను కెప్టెన్ గా అర్హత సాధించాడు.

ఆ తర్వాత అవినాష్ వెంటనే తీసుకున్న నిర్ణయం అరియనాను రేషన్ మేనేజర్ పోస్టుకి ఎంపిక చేయడం. కొన్ని నిబంధనలు కూడా అమలులోకి తీసుకొచ్చాడు. మైకులు పెట్టుకోవడం మర్చిపోయిన వాళ్లకు, ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్లకు వెరైటీ శిక్షలు పెట్టేశాడు. ఇక రేషన్ విషయంలో బిగ్ బాస్ పెట్టిన పరీక్షలో అరియనా తోటి సభ్యుల్లో మంచి మార్కులు కొట్టేసింది. అభిజిత్ బట్టల కంటే ఇంట్లో వాళ్లకు సరుకులు ముఖ్యమని తేల్చి చెప్పడంతో ఇదంతా కూల్ గా సాగిపోయింది. ఇక రేపు వీకెండ్ రాబోతోంది. నాగార్జున స్థానంలో ఆ రెండు ఎపిసోడ్లు సమంత చేయబోతోందన్న టాక్ గట్టిగా ఉంది. మరి ఈ రోజు ఏం జరగబోతోందో చూడాలి. ఎలిమినేషన్లు దాదాపుగా ఉండకపోవచ్చని అంతర్గత సమాచారం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి