iDreamPost

ఆస్ట్రేలియా పర్యటన కోసం రెండు వారాల క్వారంటైన్‌కు భారత క్రికెటర్లు సిద్ధమని ప్రకటించిన బీసీసీఐ

ఆస్ట్రేలియా పర్యటన కోసం రెండు వారాల క్వారంటైన్‌కు భారత క్రికెటర్లు సిద్ధమని ప్రకటించిన బీసీసీఐ

ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తితో ప్ర‌తిష్టాత్మ‌క ఒలింపిక్స్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన పలు క్రీడా పోటీలు, టోర్నీలు, సిరీస్‌లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.అయితే ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును పంపించటానికి బిసిసిఐ మెగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా రాబోయే ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న కోసం భార‌త క్రికెటర్లు రెండు వారాల‌పాటు క్వారంటైన్‌లో ఉండ‌టానికి సిద్ధ‌మ‌ని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్‌ తెలిపారు.క్రికెట్ మ్యాచ్‌లు తిరిగి ప్రారంభమవ్వాలంటే ఇలాంటి చ‌ర్య‌లు త‌ప్ప‌నిస‌రి అని, రెండు వారాలు అంత‌పెద్ద స‌మ‌యం కాబోద‌ని ఆయన పేర్కొన్నారు.

బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌ ప్రతినిధితో మాట్లాడుతూ “రెండు వారాలు లాక్‌డౌన్‌ ఎక్కువ కాలం కాదు. అది ఏ ఆటగాడైనా అనువైనది, ఎందుకంటే మీరు ఇంత కాలం హోం క్వారంటైన్‌లో ఉన్నప్పుడు, మరొక దేశానికి వెళ్లి రెండు వారాల లాక్‌డౌన్‌లో ఉండటం మంచిది. ఈ లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఎలాంటి నిబంధలు, ప్రమాణాలు పాటించాలన్నది మనం నిర్ణయించాల్సి ఉంది. ఈ సిరీస్‌ను ఐదు టెస్టులకు విస్తరించవచ్చని ఒక సూచన కూడా ఉంది, అయితే ఇటువంటి పరిస్థితుల్లో అదనపు ఆదాయం ఉండే పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు నిర్వహించడం ద్వారా ఆదాయం పెరుగుతుందని” వ్యాఖ్యానించాడు.

ఇంకా ధుమల్ మాట్లాడుతూ “ఆ చర్చ [ఐదు టెస్టులు] లాక్‌డౌన్‌ ముందు జరిగింది, టెస్ట్ మ్యాచ్ కోసం వెళ్ళటం కంటే ఒక టెస్ట్‌, రెండు వన్డేలు, రెండు టీ20లు ఆడే అవకాశం ఉందేమో అని ఇరు బోర్డులు పరిశీలించాలి.లాక్‌డౌన్‌ కారణంగా వారు నష్టపోతారు.లాక్‌డౌన్‌ తర్వాత ఆదాయం ఎక్కువగా రావాలంటే టెస్టుల కన్నా వన్డేలు, టీ20ల నిర్వహణ మేలని” అభిప్రాయపడ్డాడు.ఆసీస్ పర్యటనలో భారత్ నాలుగు టెస్టులు మరియు మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి