iDreamPost

బ్యాట్స్‌మన్‌ల వైఫల్యంతో చేజారిన ప్రపంచ కప్

బ్యాట్స్‌మన్‌ల వైఫల్యంతో చేజారిన ప్రపంచ కప్

ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఫేవరెట్ గా బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాకు బంగ్లాదేశ్ చేతిలో ఊహించని రీతిలో పరాభవం ఎదురయింది.ఏడు సార్లు ఫైనల్ మ్యాచ్ లు ఆడిన భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన ప్రతిసారీ ప్రపంచకప్ సాధించడంలో విఫలమయింది.ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో భారత్ పై గెలిచి తొలిసారి వన్డే క్రికెట్ లో ప్రపంచ కప్ గెలుచుకుంది.ఐసీసీ నిర్వహించే అత్యున్నత టోర్నీల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి.

భారత్ నిర్దేశించిన 178 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనను మొదలుపెట్టిన బంగ్లాదేశ్ ఓపెనర్లు 8.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు సాధించిన దశలో లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అద్భుత గూగ్లీలతో మాయ చేశాడు.మొదట తంజిద్‌ (17)ను ఔట్‌చేయడం ద్వారా ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని విడదీసిన బిష్ణోయ్‌, ఆ తర్వాత మహ్మదుల్‌ హసన్‌ (8)ని బౌల్డ్‌ చేయడంతోపాటు తౌహిద్‌ హృదోయ్‌ (0)ను వికెట్ల ముందు దొరక బుచ్చుకొని ఎల్బిడబ్ల్యుగా ఔట్‌ చేశాడు. వికెట్ కీపర్ జురెల్‌ మెరుపువేగంతో చేసిన స్టంపింగ్‌కు షాదత్‌ హుస్సేన్‌ (1) ఔట్‌ కావడంతో బంగ్లా 65/4కు పరిమితమైంది.ఈ దశలో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న మరో ఓపెనర్‌ ఇమామ్ రిటైర్డ్ హార్డ్ గా వెనుదిరిగాడు.ఎడమచేతి వాటం పేసర్‌ సుశాంత్‌ సింగ్‌ షమిమ్‌ (7)ను, అవిషేక్‌ (5)ను ఔట్‌ చేయడంతో మ్యాచ్ పై పట్టు సాధించి భారత్‌ గెలుస్తుందనిపించింది.

కానీ అక్బర్‌ అలీ ఒత్తిడిని తట్టుకుంటూ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన ఇమాన్‌తో కలిసి బంగ్లాదేశ్‌ను విజయం దిశగా నడిపించాడు.143 వద్ద ఇమాన్‌ను పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ జైస్వాల్‌ ఔట్‌ చేయడంతో భారత్‌కు మళ్లీ అవకాశమొచ్చింది.అయితే రకిబుల్‌ హసన్‌ (9 నాటౌట్‌)తో కలిసి అక్బర్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు.వర్షం కారణంగా డక్ వర్త్లూయిస్ ప్రకారం మ్యాచ్ ను 46 ఓవర్లలో 170 పరుగులకు కుదించడంతో భారత్ పై బంగ్లాదేశ్ యువ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి