iDreamPost

ఒక రోజే సభ.. మండలి రద్దు తీర్మానం పై చర్చ… బీఏసీ నిర్ణయం

ఒక రోజే సభ.. మండలి రద్దు తీర్మానం పై  చర్చ… బీఏసీ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ సమావేశాల్లో మండలి రద్దు తీర్మానంపై ఒక రోజు చర్చ జరపాలని బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయించింది. ఈ రోజు ఉదయం శాసన సభ ప్రారంభం అయిన తర్వాత సభలో చర్చించాల్సిన అంశాలపై బీఏసీ నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం సభాధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సూచించారు. ఈ మేరకు సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

సభ వాయిదా పడిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ దూరంగా ఉంది. సభకు హాజరుకాకూడదని నిన్న ఆదివారం టీడీఎల్పీ సమావేశంలో టీడీపీ నిర్ణయించిన మేరకు బీఏసీకి కూడా టీడీపీ సభ్యులు హాజరుకాలేదు. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా, బీఏసీ నిర్వహించకుండా మండలి రద్దుపై సభలో చర్చిస్తున్నారని, జోక్యం చేసుకోవాలని ఈ రోజు ఉదయం సభ ప్రారంభం కావడానికి ముందు టీడీపీ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్, స్పీకర్‌ తమ్మినేని సీతారంలకు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్‌ బీఏసీ నిర్వహించాలని సీఎంకు వైఎస్‌ జగన్‌కు సూచించారు.

మండలి రద్దుపై ఒక రోజు చర్చ జరపాలని బీఏసీ తీర్మానించిన మేరకు మరికొద్దిసేపట్లో సభ తిరిగి ప్రారంభం కానుంది. మండలి రద్దుపై చర్చ అనంతరం సభ తీర్మానం చేయనుంది. ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే సభలో మూడింట రెండొంతుల సభ్యుల మద్దతు కావాలి. సభలో 175 సభ్యులకు గాను దాదాపు 118 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉండగా అధికార వైఎస్సార్‌సీపీకి 151 మంది సభ్యులున్నారు. వీరికి తోడు టీడీపీ నుంచి ఇద్దరు, జనసేన ఏకైక ఎమ్మెల్యే కూడా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. ఫలితంగా సభలో అధికార పార్టీ మద్దుతు 154కి చేరింది. ఈ నేపథ్యంలో మండలి రద్దు తీర్మానానికి సభ ఆమోదం లాంఛనమే కానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి