iDreamPost

అసెంబ్లీ నిర్వహణ– రాజధానిపై నిర్ణయం

అసెంబ్లీ నిర్వహణ– రాజధానిపై నిర్ణయం

కొత్త సంవత్సరం ప్రారంభ నెలలోనే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాజధానిపై హైపవర్‌ కమిటీని వేయాలని మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. జీఎన్‌ రావు కమిటీ, బీసీజీ కమిటీ నివేదికలను పరిశీలించిన అనంతరం హైపవర్‌ కమిటీ రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శనం చేయనుంది.

వచ్చే నెల మూడో తేదీన బీసీజీ కమిటీ తన నివేదిక ఇవ్వనుంది.
హైపర్‌ కమిటీలో మంత్రులు, ఉన్నతాధికారులు, నిఫుణులు ఉంటారని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. రెండు కమిటీల నివేదికను హైపవర్‌ కమిటీ పరిశీలించి, ఆ తర్వాత ఇచ్చే నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిపి రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి నాని వెల్లడించారు. మూడు వారాల్లో హై పవర్‌ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఉద్యోగుల బదలాయింపు, కార్యాలయాల తరలింపు తదితర అంశాలపై కూడా కమిటీ పలు సూచనులు ఇవ్వనుందని మంత్రి చెప్పారు.

కాగా, రాజధానిపై మంత్రులందరి అభిప్రాయాన్ని సీఎం జగన్‌ తీసుకున్నారని సమాచారం. హైపవర్‌ కమిటీ ఏర్పాటు పై కూడా సీఎం మంత్రులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. కొంత మంది కమిటీ వద్దని, ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని సూచించగా, మరికొంత మంది మంత్రులు మాత్రం హైపర్‌ కమిటీ వేయాలని సూచించినట్లు సమాచారం. మొత్తం మీద రాష్ట్ర ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూసిన రాజధాని అంశంపై మరో నెల రోజుల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి