iDreamPost

కేరళ అలా ప్రపంచంలో తొలిసారి, ఇలా దేశంలో తొలిసారి

కేరళ అలా ప్రపంచంలో తొలిసారి, ఇలా దేశంలో తొలిసారి

కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారం పోలింగ్ జరగబోతోంది. ఈసారి ఫలితాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 4 దశాబ్దాల పైబడి నడుస్తున్న సంప్రదాయం ఈసారి మలబారు తీరంలో మారిపోతుందనే అంచనాలున్నాయి. ఒకేసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవడం ఆసాధ్యం అన్నట్టుగా కనిపించే కేరళలో అధికారం నిలబెట్టుకునే దిశలో కమ్యూనిస్టులు సాగుతున్నట్టు అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో తొలిసారిగా ఎన్నికల ద్వారా ఓ కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రంగా కేరళ చరిత్ర ఓసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్వాతంత్ర్య భారతంలో తొలిసారి ఓ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసేతర సర్కారు కూడా అదేకావడం విశేషం. అంతేగాకుండా దేశంలో తొలిసారి 356 వ అధికరణ ఉపయోగించి ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేసిన చరిత్ర కూడా అక్కడే జరగడం మరో ప్రత్యేకత.

నాటి కమ్యూనిస్టు నేత ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ నాయకత్వంలో ఎన్నికలద్వారా ప్రపంచంలోనే మొదటిసారిగా ఏప్రిల్ 5 1957 లో కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. కేరళలో ఉన్నప్రా వాయలార్ వంటి అనేక రైతాంగ పోరాటాలు, సాంఘిక, సామాజిక ఉద్యమాలు నడిపిన కమ్యూనిస్టులని జనం ఆదరించారు. దేశమంతా కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం సాగుతున్న దశలో అప్పట్లో ఇదో సంచలనం. నెహ్రూ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగా, కాంగ్రెస్ వ్యవహారాలు ఇందిరాగాంధీ కనుసన్నల్లో సాగేవి. అలాంటి సమయంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ ని ఓడించి ఓ రాష్ట్రాన్ని దక్కించుకోవడం దేశమంతా రాజకీయ పరిణామాల్లో మార్పునకు ఊతమిచ్చింది.

Also Read : తమిళనాడు పోలింగ్ – బీజేపీపై నటుడు విజయ్ పెట్రో బాంబ్

అదే సమయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కార్మికులకు, కర్షకులకు అనుకూలమైన విధానాలను అనుసరించింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు కేరళ ప్రభుత్వాన్ని అనుసరించాయి. అమెరికా వాషింగ్టన్ డీసీ నుండి మొదలు చాలా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారు. ప్రభుత్వ తీరును ప్రశంసించాయి. భూసంస్కరణలు, విద్యాహక్కు చట్టం అమలులోకి తెచ్చిన ఈఎంఎస్ ప్రభుత్వం సంచలన రాజకీయాలుకు ఆజ్యం పోసింది. ఇది కాంగ్రెస్ నాయకత్వానికి కంటగింపుగా మారింది. కాంగ్రెస్ ని సవాల్ చేసే రీతిలో కమ్యూనిస్టు ప్రభుత్వం తయారుకావడంతో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం 356వ అధికరణం ప్రయోగించింది. ఐదేళ్ల ప్రభుత్వం పై ప్రయోగించిన రాష్ట్రపతిపాలన అస్త్రంతో రెండేళ్లు నిండిన ప్రభుత్వం రద్దయ్యింది. ప్రపంచంలో తొలిసారి ఓట్లు ద్వారా గద్దెనెక్కిన కమ్యూనిస్టు సర్కారుపై రాత్రపతి పాలన ని తొలిసారిగా ప్రయోగించి కూల్చేసిన ఘటన చారిత్రకం అయ్యింది.

నాటినుంచి కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రతీ ఎన్నికల్లో తలబడుతున్నాయి. 70వ దశకం నుంచి కాంగ్రేస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కూటమి, సీపీఎం సారధ్యంలోని ఎల్డిఎఫ్ కూటమి చెరోసారి గెలుస్తూ వస్తున్నాయి. ఇకఈసారి అధికారంలో ఉన్న ఎల్డిఎఫ్ ఎన్నికల బరిలో వరుసగా రెండోసారి విజయకేతనం ఎగురవేస్తామని ధీమాగా ఉంది. మలయాళీల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

Also Read : కరోనాపై జగన్ చెప్పింది.. అక్షర సత్యం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి