iDreamPost

జగన్ సర్కారు నిర్ణయాన్ని సమర్ధించిన హైకోర్టు

జగన్ సర్కారు నిర్ణయాన్ని సమర్ధించిన హైకోర్టు

ఏపీ హైకోర్టులో కీలక నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. వరుసగా జగన్ ప్రభుత్వానికీ వ్యతిరేకంగా తీర్పులు వెలువడుతున్న తరుణంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు హైకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను న్యాయస్థానం తీవ్రంగా పరిగణించాల్సి వచ్చింది. అదే సమయంలో ఎన్నికల్లో ఓటమి తర్వాత కోర్టుల ద్వారా పాలనను అడ్డుకునే ప్రయత్నాలు శ్రేయస్కరం కాదంటూ ఏకంగా కేంద్రమంత్రి సైతం వ్యాఖ్యానించాల్సి వచ్చింది.

ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలయిన ఓ పిటిషన్ కొట్టివేయడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో పోస్టింగ్ ఆధారంగా వేసిన పిటిషన్లను విచారించిన కోర్టు మీడియా విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించడం ఆసక్తికరమైన విషయం అయ్యింది. సుమోటోగా తీసుకున్న పలు కేసుల్లో ప్రభ్యత్వాన్ని తప్పుబట్టిన హైకోర్టులో ఇప్పుడు జగన్ సర్కారు నిర్ణయానికి ఆమోదం లభించడం విశేషంగా తయారయ్యింది.

తెలుగులో కొన్ని మీడియా సంస్థలు దురుద్దేశపూరితంగా రాస్తున్న కథనాలు కట్టడి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అందుకు అనుగుణంగా జీఓ నెంబర్ 2346 విడుదల అయ్యింది. దాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు లో పిటిషన్ వేయగా ఇప్పుడు కోర్టు దాన్ని తోసిపుచ్చింది. నిరాధార కథనాలు అడ్డుకోవడం తప్పు కాదన్నట్టుగా సంకేతాలు ఇవ్వడం విశేషం. ముఖ్యంగా ఇప్పటికే గత ఆరు నెలల్లోనే 50కి పైగా సందర్భాల్లో జగన్ ప్రభుత్వ నిర్ణయాలను కోర్టు తప్పుబట్టడం, నిలిపివేయడం, తీవ్ర వ్యాజ్యాలు చేయడం వంటివి జరిగాయి. అలాంటి సమయంలో ఈ తీర్పు అందరినీ ఆకర్షిస్తోంది. ఓ వైపు కోర్ట్ తీర్పులపై నిరసనలు తెలిపే పరిస్థితి ఏర్పడుతుండగా, మరోవైపు ప్రభుత్వానికి సానుకూలత వ్యక్తం కావడం ఆసక్తికరమైన అంశం అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి