iDreamPost

అమరావతిపై పిటీషన్లు కొట్టేసిన ఏపీ హైకోర్టు, రాజధాని అభివృధ్ది చేయాలని ఆదేశం

అమరావతిపై పిటీషన్లు కొట్టేసిన ఏపీ హైకోర్టు, రాజధాని అభివృధ్ది చేయాలని ఆదేశం

మూడు రాజధానుల అంశంలో పలువురు దాఖలు చేసిన పిటీషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఆశ్చర్యం కలిగించడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం అమరావతితో పాటుగా విశాఖ, కర్నూలుని కూడా అభివృద్ధి చేయాలని భావించింది. దానికి అనుగుణంగా చట్టాలు చేసి ముందుకెళ్లే ప్రయత్నం జరిగింది. దానిని పలువురు న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితమే ఏపీ ప్రభుత్వం చట్టాలను ఉపసంహరించుకుంది. ఏపీ హైకోర్టులో విచారణ సందర్భంగా వ్యక్తమయిన అభిప్రాయాలు సహా పలు అంశాలను పరిగణలోకి తీసుకుని పటిష్టమైన చట్టాల రూపకల్పన చేస్తామని తెలిపింది. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో తాజాగా తీర్పు వెలువడింది. గతంలో చేసిన చట్టాల మీద దాఖలయిన పిటీషన్లను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. అదే సమయంలో అమరావతిలో రైతులు, భూములిచ్చిన వారికి సీఆర్డీయే చట్టం అమలు చేయాలని ఆదేశించింది. మూడు నెలల్లోగా ఫ్లాటులు అభివృద్ధి చేయాలని తెలిపింది. ఆరు నెలల్లోగా అమరావతి ప్రాంతం అభివృద్ధి చేసేలా ఎప్పటికప్పుడు హైకోర్టుకి నివేదించాలని వ్యాఖ్యానించింది.

అదే సమయంలో రాజధానుల అంశంలో రాష్ట్రప్రభుత్వాలకు చట్టాలు చేసే హక్కు లేదన్నట్టుగా వ్యాఖ్యానించడం ఆసక్తిగా కనిపిస్తోంది. అమరావతి అభివృద్ధికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెబుతూ కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. సీఆర్డీయే చట్టం అమలు, మూడు నెలల్లోగా అభివృద్ధి వంటి అంశాలు కూడా చర్చకు దారితీస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి