iDreamPost

నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త

నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త

ఆంధప్రదేశ్‌లోని యువత, నిరుద్యోగులకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ సర్కార్‌ శుభవార్త చెప్పింది. అతి త్వరలో గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందకు నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సీఎం జగన్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో నూతన సంవత్సరం ప్రారంభంలోనే నిరుద్యోగుల మోముల్లో ఆనందం నెలకొంది.

వేల పోస్టులకు నోటిఫికేషన్‌..

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా వైఎస్‌ జగన్‌ సర్కార్‌ గ్రామ, వార్డు సచివాలయాల్లో రూపంలో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టి అమలు చేసింది. గ్రామాల్లో ప్రతి రెండు వేల మందికి ఒక గ్రామ సచివాలయం, పట్టణాల్లో ప్రతి నాలుగు వేల మందికి ఒకటి చొప్పున వార్డు సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ లెక్కన గ్రామాల్లో 11,158, వార్డుల్లో 3786 వెరసి మొత్తం 14, 944 సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఇందులో 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది జూలైలో ప్రభుత్వం భారీ నోటిఫికేషన్‌ జారీ చేయగా 15, 971 పోస్టులు మినహా మిగతా పోస్టులు భర్తీ అయ్యాయి. ఈ నెల ఒకటి నుంచి సచివాలయ వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రారంభమైన నేపథ్యంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.

కొత్తగా 300 సచివాలయాలు..

ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాలకు అదనంగా కొత్తగా మరో 300 సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఫలితంగా మరో 3000 వేల పోస్టులు అందుబాటులోకి రానున్నాయి. ఈ పోస్టులను కూడా జతచేసి మొత్తం 18,971 పోస్టులకు నోటిఫికేషన్‌ అతి త్వరలో రానుంది.

ప్రత్యేక విభాగాల్లోనే ఎక్కువ ఖాళీలు…

గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేకమైన విభాగాల్లోనే ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
15, 971 పోస్టుల్లో 6, 916 పోస్టులు పశువర్థకశాఖ అసిస్టెంట్‌లు, 1,746 గ్రామ ఉద్యానవన శాఖ అసిస్టెంట్, 1,234 గ్రామ సర్వేయర్లు, 1,122 డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పాత విధానంలోనే భర్తీ..

ఇప్పటికే భర్తీ చేసిన విధానంలోనే తాజాగా ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయనున్నారు. 150 మార్కులకు గాను ఓపెన్‌ క్యాటగిరి అభ్యర్థులకు 40 శాతం మార్కులు, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం కనీస అర్హత మార్కులుగా గత నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. అర్హత పాందిన వారిలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు రానున్నాయి. గత భర్తీలో కనీస అర్హత మార్కులకు కూడా తగ్గించి పోస్టులను భర్తీ చేశారు. అయినా పైన పేర్కొన్న విభాగాల్లోని భారీగా పోస్టులు మిగిలిపోవడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి