iDreamPost

కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐకు బెయిల్‌.. సంచలనమైన ఏపీ ప్రభుత్వం తీరు

కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐకు బెయిల్‌.. సంచలనమైన ఏపీ ప్రభుత్వం తీరు

నంద్యాలలో ఆటో డ్రైవర్‌ అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సీఐ సోమశేఖర్‌ రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌లకు ఒక్క రోజులోనే బెయిల్‌ రావడంపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేసినా ఒక్క రోజులోనే బెయిల్‌ రావడంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వారి బెయిల్‌రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కర్నూలు సెసెన్స్‌ కోర్టులో సీఐ, హెడ్‌ కానిస్టేబుళ్ల బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ కర్నూలు ఎస్పీ పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులే నిందితులుగా ఉన్న కేసులు వారి బెయిల్‌రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

పోలీసులే నిందితులుగా ఉన్న ఈ కేసులు వారికి బెయిల్‌ ఇస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని ఎస్పీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బెయిల్‌ ఇవ్వడం వల్ల దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని నివేదించారు. ప్రత్యక్ష సాక్షులు ఇద్దరు నిందితులను నేరుగా వేలెత్తి చూపుతున్నారని, బెయిల్‌ ఇవ్వడం వల్ల సాక్షులను బెదిరించి, కేసును పక్కదోవ పట్టించే ప్రమాదం ఉందని పిటిషన్‌లో వివరించారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబం సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ పేర్లను తమ సెల్పీ వీడియలో ప్రస్తావించారని, ఇంతటి బలమైన నేరారోపణలు ఉన్న నేపథ్యంలో బెయిల్‌ మంజూరు సరికాదని, వెంటనే రద్దు చేయాలని ఎస్పీ తన పిటిషన్‌లో ప్రస్తావించారు. బాధితులను ఆత్మహత్యకు పురిగొల్పారన్న ఆరోపణలతో నిందితులపై నాన్‌బెయిలబుల్‌ సెక్షన్‌ 306 రెడ్‌ విత్‌ 34తో పాటు 323, 324 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

కాగా, సలాం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. సలాం అత్తకు ఈ మొత్తాన్ని అందించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి