iDreamPost

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం సరికొత్త రికార్డు!

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ  ప్రభుత్వం సరికొత్త రికార్డు!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం విషయంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు స్పూర్తిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పేదల కోసం పక్కా ఇళ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఇళ్లులేని పేదవారికి పక్కా ఇళ్లు కట్టిస్తోంది. ఇక, పేదల ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆనతి కాలంలో ఏకంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. అంతేకాదు! ఈ నెలఖరులోగా వాటిని లబ్ధిదారులకు అందించనుంది. దాదాపు 5,00,653 మంది సొంతింటి కల నెలవేరనుంది. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇది వరకే దాదాపు 31 లక్షల మందికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంచింది.

రెండు దశల్లో 21.25 లక్షలపైగా టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలోనే 5 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పుడు పూర్తయింది. ఇక, పూర్తయిన ఇళ్లకు కరెంటు, నీటి కనెక్షన్లు కూడా ఇస్తున్నారు. అవి పూర్తయిన వెంటనే వాటిని లబ్ధిదారులకు అప్పగించనున్నారు. కాగా, 2020 డిసెంబర్‌ నెల 25న సీఎం జగన్‌ కాకినాడ జిల్లా, యూ కొత్తపల్లిలో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురయినా సీఎం జగన్‌ ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. దాదాపు రెండేళ్ల ఎనిమిది నెలల కాలంలోనే 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. కరోనా సంక్షోభం, తీవ్ర వర్షాలు, వరదలు, ప్రకృతి విపత్తులు..

ప్రతి పక్షాల ఎత్తుగడలను ఎదుర్కొని ప్రభుత్వం ఈ ఘనతను సాధించింది. దీనిపై మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా మిగిలిన ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ మాట్లాడుతూ.. పూర్తయిన ఇళ్లలో త్వరలో గృహ ప్రవేశ వేడుకలు నిర్వహిస్తామన్నారు. మరి, ఆనతి కాలంలో ఏపీ ప్రభుత్వం ఏకంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి