iDreamPost

పోరాట యోధుల్లో అల్లూరి ఒక మహా అగ్ని కణం: సీఎం జగన్‌

పోరాట యోధుల్లో అల్లూరి ఒక మహా అగ్ని కణం: సీఎం జగన్‌

ల‌క్ష‌లాది మంది వీరుల త్యాగాల ఫ‌లిత‌మే నేటి భార‌త‌దేశ‌మ‌ని అన్నారుఉ సీఎం జ‌గ‌న్. ఒక మనిషిని, ఇంకొక మనిషి, ఒక జాతిని మరొక జాతి, ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని స‌మ‌ సమాజాన్ని సమరయోధులు ఆకాంక్షించారని జ‌గ‌న్ అన్నారు. స్వేచ్ఛ కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. ఇలాంటి పోరాట యోధుల్లో అల్లూరి ఒక మహా అగ్ని కణం. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం మ‌న‌కు గర్వకారణమని సీం కొనియాడారు.

అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతిని పురస్కరించుకుని మనమంతా ఇవాళ ఏకమయ్యాం. ఒక దేశాన్ని మరో దేశం, ఒక జాతిని ఇంకో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని మన స్వాతంత్య్ర యోధులందరూ కూడా కలలు కన్నారు. ఇది వారిని స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం జరుపుకుంటున్న సంవత్సరం. మన స్వాతంత్య్రానికి ఈ ఏడాది 75సంవత్సరాలు నిండుతాయి. దానర్ధం మనల్ని మనం పాలించుకోవడం ప్రారంభమై ఇప్పటికే 75 సంవత్సరాలు అవుతుంది. మన గడ్డమీద మన పూర్వీకులు, వారి భవిష్యత్తుని, వారి జీవితాన్ని, రక్తాన్ని ధారపోసి మన దేశానికి ఈ స్వాతంత్య్రాన్ని ఇచ్చారు. అలాంటి స్వాతంత్య్రం అమృతంతో సమానం. ఇది ఈ అజాదీ కా అమృత్‌ అనే పదానికి అర్ధం. 75 ఏళ్ల క్రితం వరకు జరిగన మన దేశ స్వాతంత్య్ర సమరంలో, మన జాతీయ ఉద్యమంలో 1757 నుంచి 1947 సంవత్సరం వరకు.. అంటే దాదాపు 190 సంవత్సరాలు ఒక్కసారి తిరిగి చూస్తే, పరాయి దేశాల, పరాయి పాలన మీద మన దేశం యుద్ధం చేస్తూనే… అడుగులు ముందుకు వేసింది.

లక్షల మంది తమ ప్రాణాలు పణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితమే నేటి మన భారతదేశం. అటువంటి మహా త్యాగ మూర్తుల్లో మన గడ్డమీద, ఈ రాష్ట్రం మట్టి నుంచి, ఇక్కడ ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే.

అటువంటి త్యాగధనుల్లో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికణం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు. అడవిలో కూడా అగ్గి పుట్టించిన ఆ యోధుడు, సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పిన సంస్కర్త. భావాల పరంగా ఎన్నటికీ మరణం లేని ఓ విప్లవవీరుడు. ఈ 125 వ జయంతి సందర్భంగా, ఆ అల్లూరిని స్మరించుకునేందుకు మన ప్రధామంత్రి సమక్షంలో మనమంతా ఈరోజు సమావేశమయ్యాం.

తెలుగుజాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన ఆ మహనీయుడు అడవిబిడ్డలకు ఆరాధ్యదైవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈ రోజు గొప్పగా నివాళులు అర్పిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు గారి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టే, ఆయన నడయాడిన నేల, నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు, జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టాం.

ఇక్కడ (భీమవరంలో)ఏ రకంగా విగ్రహావిష్కరణ జరుగుతుందో, ఆ జిల్లాలో కూడా ఆ మహానుభావుడి కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతోంది. తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని కూడా తరతరాలకు సందేశమిచ్చేలా బతికి, చిన్న వయసులోనే తన ప్రాణాలను త్యాగం చేసిన ఆ మహామనిషిని తెలుగుజాతి ఎప్పటికీ మర్చిపోదు. దేశం కోసం అడవి బిడ్డల కోసం తనను తానే త్యాగం చేసుకున్న ఆ మహావీరుడికి నా వందనమ‌ని ఘ‌నంగా నివాళులు అర్పించారు వైఎస్ జ‌గ‌న్.


వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి