iDreamPost

CM Jagan: కుప్పం ప్రజలని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాం: సీఎం జగన్‌

  • Published Feb 26, 2024 | 2:03 PMUpdated Feb 26, 2024 | 2:07 PM

కుప్పం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్‌.. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

కుప్పం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్‌.. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Feb 26, 2024 | 2:03 PMUpdated Feb 26, 2024 | 2:07 PM
CM Jagan: కుప్పం ప్రజలని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాం: సీఎం జగన్‌

ఏడు సార్లు కుప్పం నుంచి గెలిచినా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఓ సారి ముఖ్యమంత్రిగా పని చేశారు చంద్రబాబు. కానీ ఏనాడు ఆయన కుప్పం అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ 2019 ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కుల, మత, ప్రాంతాలు అనే తేడా లేకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి పథంలో పయనించేలా.. ప్రతి గడపకి సంక్షేప పాలన అందిస్తున్నారు. జగన్‌ సీఎం అయ్యాక కుప్పం అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. అలానే కుప్పానికి కృష్ణా జలాలు తీసుకువచ్చారు. హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మను కుప్పంలోకి తీసుకువచ్చారు.

హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీటిని విడుదల చేసిన సీఎం జగన్‌.. సోమవారం నాడు కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం కుప్పం శాంతిపురంలో భారీ బహిరంగ సభలో పాల్గోన్నారు. జగన్‌ ప్రసంగిస్తూ.. ‘‘దేవుడి దయతో నేడు ఓ మంచి కార్యక్రమాన్ని కుప్పంలో జరుపుకుంటున్నాం. కొండలు, గుట్టలు దాటుకుని, ఏ రకంగా 672 కి.మీ దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ.. కుప్పంలోకి ప్రవేశించింది. 2022, సెప్టెంబర్‌ 23వ తేదీన, ఇదే కుప్పంలో జరిగిన బహిరంగ సభకు ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చాను. చెప్పినట్లుగానే నేడు కుప్పానికి కృష్ణా జలాలను తీసుకువచ్చాను’’ అని తెలిపారు.

‘‘చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా ఎమ్మెల్యే.. 14 ఏళ్లు సీఎంగా కూడా పని చేశారు. తన 35 ఏళ్ల రాజకీయ కెరీర్‌లో చంద్రబాబు కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తి చేయలేకపోయారు. చంద్రబాబు.. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను నిధులు పారే ప్రాజెక్టుగా మార్చి.. అంచనాలు పెంచి అయినవాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. కానీ నేడు 2 లక్షల మందికి ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలన్న లక్ష్యంతో మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కల సాకారం చేసింది’’ అన్నారు.

‘‘కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది.. దీన్ని మున్సిపాలిటీగా మార్చింది.. కుప్పానికి రెవెన్యూ డివిజన్‌, పోలీస్‌ సబ్‌ డివిజన్‌ ఇచ్చింది ఎవరంటే మీ జగన్‌. చంద్రబాబు తన హెరిటేజ్‌ లాభాల కోసం మూసివేయించిన చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా, దేశంలో అతిపెద్ద సహకార సంఘం డెయిరీ అమూల్‌ను తీసుకొచ్చి పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధరను అందించేలా ఏర్పాటు చేసింది ఎవరంటే మీ జగన్‌’’ అని చెప్పుకొచ్చారు.

‘‘కుప్పం నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేసింది రూ. 1400 కోట్లు. చంద్రబాబు పాలనకు సంబంధింది ఐదేళ్లు స్టేట్‌మెంట్‌, మీ బిడ్డ జగన్‌ వచ్చిన తర్వాత స్టేట్‌మెంట్స్‌ తీసుకోండి. బాబుగారి పాలనలో ఒక్క రూపాయి అయినా వచ్చిందా అని చూసుకోమని అడుగుతున్నా. దాన్ని బట్టి ఎవరిది మనసున్న పాలన.. ఎవరిది పేదల ప్రభుత్వమో ఆలోచించమని కోరుతున్నా. కుప్పం ప్రజలంతా మా వాల్లేనని.. వారిని గుండెల్లో పెట్టుకుని చూశాం. కులం, మతం, ప్రాంతం, పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమం అందించాం’’ అన్నారు.

‘‘కుప్పంలో 44,888 మహిళలకు రూ. 172 కోట్లు ఇచ్చాం. పెన్షన్‌ మొత్తాన్ని మూడు వేల రూపాయలకుపెంచి.. 45,374 మందికి అందిస్తున్నాం. గతంలో కుప్పంలో 31 వేల మందికి మాత్రమే చంద్రబాబు పెన్సన్‌ ఇచ్చారు.. అది కూడా వెయ్యి రూపాయలే. ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎటువంటి వివక్ష లేకుండా పెన్షన్లు ఇస్తున్నాం’’ అని తెలిపారు. అలానే వైసీపీ ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా చెప్పుకొచ్చారు జగన్‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి