iDreamPost

AP: ఫ్రీ కోచింగ్‌తో గ్రూప్‌ 1 జాబ్‌ సాధించిన గిరిజన యువతి

  • Published Aug 22, 2023 | 2:13 PMUpdated Aug 22, 2023 | 2:13 PM
  • Published Aug 22, 2023 | 2:13 PMUpdated Aug 22, 2023 | 2:13 PM
AP: ఫ్రీ కోచింగ్‌తో గ్రూప్‌ 1 జాబ్‌ సాధించిన గిరిజన యువతి

నేటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏళ్ల తరబడి.. వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌ తీసుకున్నప్పటికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదు. పోస్టులు వందల్లో ఉంటే… పోటీ పడే అభ్యర్థులు లక్షల్లో ఉంటున్నారు. దాంతో పరీక్షల నిర్వహణ, ప్రశ్నల సరళి కూడా మారింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పరీక్షలు.. యూపీఎస్సీ అంత కఠినంగా ఉంటున్నాయి. అయితే పేద విద్యార్థులు ఇన్ని వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌ తీసుకోలేరు. దాంతో ప్రభుత్వాలే.. ప్రతిభావంతులైన పేద అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్‌ ఇప్పిస్తున్నాయి. అలా ఫ్రీ కోచింగ్‌ తీసుకుని.. గ్రూప్‌ 1 జాబ్‌ సాధించి.. ఎందరికో ఆదర్శంగా నిలిచింది ఓ గిరిజన యువతి. ఆ వివరాలు..

డాక్టర్‌ కావాలనుకున్న ఓ గిరిజన యువతి త్వరలోనే డీఎస్పీ కాబోతుంది. తాజాగా ప్రకటించిన ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ఫలితాల్లో విజయం సాధించి… డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించనుంది సదరు యువతి. ఉచిత కోచింగ్‌కు హాజరయ్యి.. కష్టపడి చదివి.. గ్రూప్‌ 1 ఉద్యోగం సాధించింది ఆ యువతి. ఆమె అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలుకు చెందిన గిరిజన యువతి జీవన పడాల్. తాజాగా వెల్లడించిన ఏపీ గ్రూప్ 1 పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించింది. ఇందుకోసం జీవన.. గిరిజన అభ్యర్థుల కోసం ఐటీడీఏ ఉచితంగా అందించిన సివిల్స్ అండ్ గ్రూప్స్ కోచింగ్‌ కేంద్రంలో శిక్షణ తీసుకుంది. అక్కడ ఇచ్చిన కోచింగే తన విజయానికి కారణమని చెప్పుకొచ్చింది.

డాక్టర్‌ అవ్వాలని కలలు కన్న జీవన.. దాన్ని సాధించలేకపోయింది. దాంతో ఇంటర్‌ పూర్తి చేసిన తర్వాత.. డిగ్రీలో జాయిన్‌ అయ్యింది. కుటుంబ సభ్యుల సహకారంతో.. గ్రూప్స్‌ దిశగా అడుగులు వేసింది. డిగ్రీ చివరి సంవత్సరం నుంచే చదవడం ప్రారంభించానని చెప్పుకొచ్చింది. గ్రూప్స్‌ ప్రిలిమ్స్‌ క్వాలిఫై అయిన తర్వాత తాను.. ఐటీడీఏ ఉచితంగా అందించిన సివిల్స్ అండ్ గ్రూప్స్ కోచింగ్‌ కేంద్రంలో చేరానని.. అక్కడ సిబ్బంది ఇచ్చిన శిక్షణ, కోచింగ్‌ కారణంగానే తాను మెయిన్స్‌లో విజయం సాధించానని చెప్పుకొచ్చింది జీవన. ఇక 23 ఏళ్ల పిన్న వయసులోనే జీవన సాధించిన విజయం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి