iDreamPost

అంగ్రేజ్ మీడియం పాసయ్యిందా

అంగ్రేజ్ మీడియం పాసయ్యిందా

2017లో ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘హిందీ మీడియం’ ఎంత సంచలన విజయం సాధించిందో చూశాం. చైనాలో అనువదించి విడుదల చేస్తే అక్కడా వందల కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. సాకేత్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో డీల్ చేసిన కాన్సెప్ట్ ప్రేక్షకులకు బ్రహ్మాండంగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత అదే తరహాలో మరో సినిమాతో వచ్చాడు ఇర్ఫాన్ ఖాన్. అదే అంగ్రేజీ మీడియం. చెప్పుకోదగ్గ అంచనాలతోనే నిన్న రిలీజయింది. ఆమధ్య తీవ్ర అనారోగ్యంతో బాధపడి విదేశాల్లో చికిత్స తీసుకున్న ఇర్ఫాన్ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత చేసిన మూవీ ఇది. ఈ వెర్షన్ కి హోమీ ఆడజానియా దర్శకత్వం వహించారు.

కథ విషయానికి వస్తే చంపక్(ఇర్ఫాన్ ఖాన్) అనే స్వీట్ల వ్యాపారి తన ఒక్కగానొక్క కూతురు తారిక(రాధికా మదన్)ను అల్లారుముద్దుగా పెంచుతాడు. తనని గొప్ప స్థాయిలో చూడాలని ఘనంగా పెళ్లి చేయాలనీ డబ్బు కూడబెడుతూ ఉంటాడు. అయితే తారికకు విదేశాల్లో చదవాలని గుర్తించిన చంపక్ దానికి తగ్గ సొమ్ము జమయ్యాక కూతురు, తమ్ముడితో సహా లండన్ వెళ్ళిపోతాడు. అక్కడ వీళ్ళకు అసలు కష్టాలు మొదలవుతాయి. ఇంగ్లీష్ రాని ఇబ్బందికర పరిస్థితుల్లో చంపక్ కు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. తండ్రికూతుళ్లు కోరుకున్నట్టు వాళ్ళ లక్ష్యం చేరుకున్నారా లేదా అనేదే అసలు పాయింట్.

పాయింట్ లో కొంత కొత్తదనం ఉన్నప్పటికీ కథనం సరిగా లేకపోవడంతో అంగ్రేజ్ మీడియం అంచనాలు అందుకోలేకపోయింది. ఫస్ట్ హాఫ్ లో చూపించిన సెట్ అప్, నాన్న కూతురి మధ్య బాండింగ్ ఇవన్నీ కొంతవరకు సరిగానే కుదిరినా ఆసక్తికరంగా నడపడంలో దర్శకులు ఫెయిల్ అవ్వడంతో స్క్రీన్ ప్లే చాలా నీరసంగా నడుస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే బలమైన థ్రెడ్స్ లేకపోవడంతో బోర్ కొట్టేస్తుంది.

అడిషనల్ ఫ్లేవర్ కోసం డింపుల్ కపాడియా, కరీనా కపూర్ ట్రాక్ ని జోడించినా లాభం లేకపోయింది. మొదటి భాగం స్థాయిలో అంగ్రేజ్ మీడియంని ఏ మాత్రం ఆశించినా తీవ్ర నిరాశ తప్పదు. యాక్టింగ్ పరంగా ఇర్ఫాన్ ఖాన్ తో పాటు ఇతర తారాగణం బెస్ట్ ఇచ్చినప్పటికీ వాటిని వాడుకునే స్థాయిలో కథనం లేకపోవడంతో అంగ్రేజ్ మీడియం ఎలాంటి ప్రత్యేకతను చూపించలేకపోయింది. ఇర్ఫాన్ ఖాన్ ఫాన్స్ గర్వంగా సెలెబ్రేట్ చేసుకునే అవకాశాన్ని ఈ మూవీ ఇవ్వలేదు. నిజానికి దీనికి హిందీ మీడియంకు కొనసాగింపు తరహాలో ప్రచారం చేయడం కూడా హైప్ ని పెంచేసి దెబ్బతీసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి