iDreamPost

ప్రపంచ బ్యాంక్‌లో ఉద్యోగం సాధించిన తెలుగమ్మాయి.. గర్వంగా ఉంది తల్లి

  • Published Aug 10, 2023 | 10:44 AMUpdated Aug 10, 2023 | 10:44 AM
  • Published Aug 10, 2023 | 10:44 AMUpdated Aug 10, 2023 | 10:44 AM
ప్రపంచ బ్యాంక్‌లో ఉద్యోగం సాధించిన తెలుగమ్మాయి.. గర్వంగా ఉంది తల్లి

మనిషి జీవితంలో విజయం సాధించాలి.. ఉన్నత శిఖరాలు చేరాలంటే.. ముఖ్యంగా కావాల్సింది కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం.. మన మీద మనకు నమ్మకం. అవి ఉన్న వ్యక్తి.. ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. ముందుకు సాగుతారు.. విజయ తీరాలను చేరతారు. ఈమాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి. చిన్నతనం నుంచి చదువుల్లో రాణిస్తూ.. నేడు ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం సాధించింది తెలుగు అమ్మాయి. ఆమె ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. ఆ వివరాలు..

ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం సాధించి.. ఎందరికో ఆదర్శంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్‌, కృష్ణ జిల్లాకు చెందిన ఇందు అనే యువతి. ఆమె సొంత ఊరు పెనమలూరు. ఇక ఇందు కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. ఆమెది మధ్య తరగతి కుటుంబం. ఆమె తండ్రి సత్యనారాయణ గెస్ట్‌ లెక్చరర్‌గా పని చేస్తుండగా.. తల్లి మాధవి గృహిణి. ఇక ఇందు విజయవాడలో బీటెక్‌ పూర్తి చేసి.. ఎంఎస్‌ చేయడం కోసం అమెరికా వెళ్లింది. అక్కడ ఎంస్‌ పబ్లిక్‌ పాలసీ పూర్తి చేసిన ఇందు.. ఆ తర్వాత వరల్డ్‌ బ్యాంక్‌లో ఉద్యోగం సాధించింది.

ఈ సందర్భంగా ఇందు మాట్లాడుతూ.. ‘‘నేను ఎంఎస్‌ చేయడానికి అమెరికా వచ్చినప్పుడే నిర్ణయించుకున్నాను. ఇక్కడే ఉద్యోగం చేయాలని.. అది కూడా ప్రపంచ స్థాయిలో మానవజాతిని ప్రభావితం చేయగల ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ సంస్థల్లో పని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నా కలను నిజం చేసుకున్నాను. ఇక నేను ఎంఎస్‌ చేయడానికి యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌– మేసన్‌లో చేరాను. అక్కడ పబ్లిక్‌ పాలసీ కోర్సులో జాయిన్‌ అయ్యాను. ఇక ఎంఎస్‌ చదువుతోన్న సమయంలోనే అమెరికాలోనే ఎంతో పేరున్న ప్రొఫెసర్‌ టిమ్‌ స్మీడింగ్‌ దగ్గర నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నట్లు వివరించారు ఇందు. యూనివర్సిటీ స్థాయిలో తాను ఇచ్చిన ప్రజెంటేషన్‌లు, పరిశోధనలతో ప్రపంచ బ్యాంకు ఉద్యోగం వచ్చింది అని తెలిపింది.

ప్రపంచ బ్యాంకు ఉద్యోగంలో భాగంగా ఇందుకు దక్షిణ ఆసియా దేశాలకు చెందిన వాతావరణ విభాగం బాధ్యతలను అప్పగించారు. వాతావరణ మార్పును అధ్యయనం చేసే నిపుణురాలిగా.. అలాగే జాయింట్‌ మల్టీ బ్యాంకు డెవలప్‌మెంట్‌, విధానాల రూపకల్పనలు, టెక్నాలజీ, వాటిని అమలు చేయటం, వివిధ దేశాలలో వాతావరణ కాలుష్యం ప్రామాణికతల నిర్ణయం ఇలా మరికొన్ని కార్యక్రమాల అమలు తేడాలను విశ్లేషించే బాధ్యతలు ఇందుకు అప్పగించారు. వీటిపై రిపోర్టులు తయారు చేయడం, ఎంవోయూలు చేసుకోవడం, సమావేశాల్లో చర్చించడం వంటి బాధ్యతలు ఇందు నిర్వహించాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం ఇందుకు ప్రత్యేకంగా జీ4 వీసా ఇచ్చింది. ఇప్పటికే ఉద్యోగంలో చేరాలని ప్రపంచ బ్యాంకు నుంచి ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే ఇందు అమెరికా వెళ్లి విధుల్లో చేరనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి