iDreamPost

ఏపీ సర్కారు మరో ఘనత.. డిజిటల్ హెల్త్ అకౌంట్లలో దేశంలోనే రెండో స్థానంలో..!

  • Author singhj Published - 11:20 AM, Thu - 3 August 23
  • Author singhj Published - 11:20 AM, Thu - 3 August 23
ఏపీ సర్కారు మరో ఘనత.. డిజిటల్ హెల్త్ అకౌంట్లలో దేశంలోనే రెండో స్థానంలో..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్​ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. డెవలప్​మెంట్ పరంగా అన్ని రంగాల్లోనూ రాష్ట్రం దూసుకెళ్లాలని భావిస్తున్న సీఎం.. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందేలా వైద్యరంగాన్ని కూడా బలోపేతం చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వాసుపత్రులను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతూనే, రాష్ట్రవ్యాప్తంగా కొత్త వైద్య కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాగే డిజిటల్ వైద్య సేవలు అందించే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్​ (అభా)ల సృష్టిలోనూ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు.

డిజిటల్ హెల్త్ ఖాతాల సృష్టిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్​ రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రీసెంట్​గా పార్లమెంటులో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 43.01 కోట్ల మంది అభా రిజిస్ట్రేషన్స్ చేశారు. రాష్ట్రాలవారీగా చూసుకుంటే ఉత్తర్​ప్రదేశ్​ 4.29 కోట్ల ఖాతాలతో ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 4.10 కోట్ల అకౌంట్లతో ఏపీ రెండో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్​ 4.04 కోట్లతో మూడో ప్లేసులో ఉంది. సౌతిండియా నుంచి ఏపీ తప్ప మరే ఇతర రాష్ట్రం కూడా టాప్-5లో లేకపోవడం గమనార్హం.

డిజిటల్ హెల్త్ అకౌంట్​ల సృష్టిలో కర్ణాటక 2.35 కోట్ల ఖాతాలతో ఎనిమిదో స్థానంలో, 98 లక్షల ఖాతాలతో తెలంగాణ పద్నాలుగో ప్లేసులో నిలిచాయి. అభా ఖాతాలో ప్రతి పౌరుడికి 14 అంకెల డిజిటల్ హెల్త్ ఐడీ ఇస్తారు. దీంట్లో ఆ వ్యక్తి హెల్త్ హిస్టరీ మొత్తం నమోదు చేస్తారు. అలాగే ఇందులో ఓపీ, ఐపీ స్లిప్పులు, వైద్య పరీక్షల ఫలితాలు, పాత చికిత్స తాలూకు ఫైల్స్ లాంటి వివరాలన్నీ ఉంటాయి. దీని వల్ల దేశంలో ఎక్కడి నుంచి అయినా ఒకే ఒక్క క్లిక్​తో హెల్త్ హిస్టరీ అందుబాటులో ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్​లో భాగంగా పేపర్ రహిత సేవలు అందించేందుకు వీలుగా ఈ-హాస్పిటల్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి