iDreamPost

శ్మశానవాటికలో కంచె.. అంత్యక్రియల వేళ రెండు గ్రామాల మధ్య గొడవ!

  • Author singhj Published - 09:16 PM, Thu - 10 August 23
  • Author singhj Published - 09:16 PM, Thu - 10 August 23
శ్మశానవాటికలో కంచె.. అంత్యక్రియల వేళ రెండు గ్రామాల మధ్య గొడవ!

మనతో సన్నిహితంగా ఉండేవారు, స్నేహితులు, ఆప్తులు చనిపోయినప్పుడు ఉండే బాధను మాటల్లో చెప్పలేం.  మృతి చెందిన వారి కుటుంబీకులు పడే రోదన అంతా ఇంతా కాదు. వాళ్లు దూరమై ఏళ్లు గడిచినా ఆ బాధ నుంచి బయటకు రాలేరు. ఇదిలా ఉంటే.. అంత్యక్రియల వేళ శ్మశానవాటికలో చిచ్చు రేగింది. రెండు గ్రామాల మధ్య తీవ్ర వివాదం జరిగింది. ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించడానికి వీల్లేదంటూ ఒక గ్రామానికి చెందిన వారు మరో గ్రామానికి చెందిన వారిని అడ్డుకున్నారు. బంధువు మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకొచ్చిన మరో గ్రామానికి చెందిన వాళ్లను ఈ పరిణామం ఆవేదనకు గురిచేసింది.

ఈ ఘటన ఏపీలోని అల్లూరి జిల్లా, పాడేరులో చోటుచేసుకుంది. శ్మశానవాటిక కోసం ముంతమామిడి, మినుములూరు అనే రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగస్టు 10న ముంతమామిడి గ్రామానికి చెందిన ఒక వృద్ధుడు చనిపోయాడు. ఆ వృద్ధుడి అంత్యక్రియలు జరిపేందుకు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహాన్ని మినుములూరు పరిధిలో అంత్యక్రియలు నిర్వహించే చోటుకు తీసుకెళ్లారు. అయితే దీన్ని గమనించిన మినుములూరు గ్రామస్థులు వాళ్లను రానివ్వకుండా అడ్డుగా కంచె వేశారు. దీంతో మృతదేహంతో సహా ముంతమామిడి గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.

ముంతమామిడి-మినుములూరు గ్రామస్థుల గొడవ గురించి సమాచారం అందుకున్న పాడేరు ఎస్సై లక్షణ్ తన సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు గ్రామాలకు చెందిన వారి వాదనలు విన్నారు. వందేళ్ల నుంచి ఇక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని ముంతమామిడి ప్రజలు చెబుతున్నారు. అయితే అది తమ పట్టా భూమి అని మినుములూరు గ్రామస్థులు అంటున్నారు. ఇరు గ్రామాల ప్రజల వాదనలు విన్న ఎస్సై లక్షణ్.. ఈసారికి అంత్యక్రియలు నిర్వహించుకోనివ్వాలని సర్దిచెప్పారు. వృద్ధుడి మృతదేహాన్ని ఖననం చేసేంత వరకు ఆయన అక్కడే ఉన్నారు. ఈ సమస్యను రెవెన్యూ కార్యాలయంలో పరిష్కరించుకోవాలని సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి