iDreamPost

నేడు పుర ఫలితాలు.. అందరిలోనూ ఉత్కంఠ..

నేడు పుర ఫలితాలు.. అందరిలోనూ ఉత్కంఠ..

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఈ నెల 10వ తేదీన 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 75 మున్సిపాలిటీ, నగరపంచాయతీలకు గాను పులివెందుల, పిడుగురాళ్ల, పలమనేరు, మాచర్ల మున్సిపాలిటీల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల ఎక్కింపు ప్రారంభం కానుంది. బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరిగింది. కౌటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే యంత్రాంగం పూర్తి చేసింది. ఏలూరు కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీకి పోలింగ్‌ జరిగినా.. హైకోర్టు ఆదేశాల మేరకు అక్కడ కౌటింగ్‌ చేపట్టడం లేదు. మిగతా 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఈ ఎన్నికల్లో 64.34 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. నగరపాలక సంస్థల్లో 60 శాతం, మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో 71.37 శాతం చొప్పన పోలింగ్‌ జరిగింది. నగరాల్లో అత్యధికంగా ఒంగోలులో 74.84 శాతం, అత్యల్పంగా కర్నూలులో 49.73 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. పట్టణాలలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపాలిటీలో అత్యధికంగా 86 శాతం, కర్నూలు జిల్లా ఆదోనిలో అత్యల్పంగా 50.05 శాతం మేర పోలింగ్‌ జరిగింది.

Also Read : ఎన్నికల కోసం వచ్చిన వారితోనే మళ్లీ కరోనా విస్తరణ, ప్రభుత్వ అంచనా తప్పలేదు..

12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగినా.. అందరి దృష్టి నాలుగు కార్పొరేషన్లపైనే కేద్రీకృతమైంది. కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ నాలుగు కార్పొరేషన్లలో దాదాపు అన్ని వార్డుల్లోనూ పోలింగ్‌ జరిగింది. ఈ నాలుగు కార్పొరేషన్లలో వైసీపీ గెలిస్తే.. మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రజల మద్ధతు ఉన్నట్లనే భావన నెలకొంది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో.. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో వైసీపీ గెలిస్తే.. అమరావతిని తరలించేందుకు అనుమతి ఇచ్చినట్లేనన్నారు.

చంద్రబాబు చేసిన ఈ ప్రకటనతో విజయవాడ, గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికలు అమరావతిపై రెఫరెండంగా మారాయి. ఇదే పరిస్థితి విశాఖలోనూ నెలకొంది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించిన తర్వాత టీడీపీ వ్యతిరేకించింది. గత ఎన్నికల్లో విశాఖ సిటీలోని నాలుగు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలుచుకుంది. 20 నెలల తర్వాత జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ తన పట్టు నిలుపుకుంటుందా..? కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను వ్యతిరేకించిన ప్రభావం కనిపిస్తుందా..? అనే ఆసక్తి నెలకొంది.

ఈ రోజు మధ్యాహ్నాం కల్లా సగం ఫలితాలు వెలువడి.. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లు ఏ పార్టీ గెలుచుకోబోతోంది తెలుస్తుంది. సాయంత్రం కల్లా తుది ఫలితాలు రానున్నాయి. వార్డులు, డివిజన్ల వారీగా ఓట్లు లెక్కింపు, ఫలితాలు ప్రకటించనున్నారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఒక వార్డులో సరాసరి 3 వేల ఓట్లు, నగరపాలక సంస్థల్లో ఒక డివిజన్‌లో సరాసరి 5 వేల ఓట్లు ఉంటాయి. మొత్తం ఓట్లలో సరాసరి 64.34 శాతం మేర ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో వార్డులు, డివిజన్ల వారీగా పోలైన ఓట్ల లెక్కింపు గంటల వ్యవధిలోనే పూర్తికానుంది.

Also Read : రేపల్లె రెప రెపలాడేంచేది ఎవరో?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి