iDreamPost

భూ కుంభకోణంపై విచారణకు చంద్రబాబు అండ్‌ కోను అమరావతి రైతులు ఒప్పించనున్నారా..?

భూ కుంభకోణంపై విచారణకు చంద్రబాబు అండ్‌ కోను అమరావతి రైతులు ఒప్పించనున్నారా..?

రాజధాని కోసం మా భూములు త్యాగం చేశాం. మా భవిష్యత్‌ ఏమిటో అర్థం కావడం లేదు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించే వరకూ మా పోరాటం ఆగదు.. అంటున్న అమరావతిలోని నాలుగైదు గ్రామాల రైతులకు అసలు అమరావతి వ్యవహారంపై జరిగిన, జరుగుతున్న అంశాలపై అవగాహన ఉందా..? లేదా..? అనే సందేహాలు వారు చేస్తున్న ప్రకటనల వల్ల అందరిలోనూ కలుగుతున్నాయి.

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని చెబుతూ వైసీపీ పెద్దలు అమరావతిపై పెద్ద కుట్ర చేస్తున్నారని ఉద్యమం చేస్తున్న రైతులు విమర్శించడంతో ఈ సందేహాలకు ఆస్కారం ఏర్పడింది. నిజంగా ట్రేడింగ్‌ జరిగితే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోందంటూ కూడా ప్రశ్నించడంతో నిజంగా రైతులకు అమరావతి విషయంలో జరుగుతున్న అంశాలపై అవగాహన లేదా..? లేక ఉన్నా లేనట్లుగా మాట్లాడుతున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని 2015లోనే ఆధారసహితంగా మీడియాలో కథనాలు వచ్చాయి. అప్పటి సీఎం చంద్రబాబు కూడా.. కొంటే తప్పేంటి.. అంటూ భూముల కొనుగోళ్లను సమర్థించుకున్నారు. వచ్చిన ఆరోపణలు నిజం కాదంటూ కనీసం విచారణ కూడా జరపలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతిలో జరిగిన భూ దందాపై దృష్టి పెట్టింది. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు మంత్రివర్గం తీర్మానం చేసి.. కేంద్ర హోం శాఖకు రాష్ట్ర హోం శాఖ మార్చి 23వ తేదీన లేఖ రాసింది.

అయితే అమరావతిపై ప్రభుత్వం తలపెట్టిన విచారణను అడ్డుకునేందుకు టీడీపీ నేత వర్ల రామయ్యతోసహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ పెండింగ్‌లో ఉంది. ఈ విషయాలు అమరావతి రైతులకు తెలియక మాట్లాడుతున్నారా..? లేక రైతుల ముసుగులో ఉన్న టీడీపీ కార్యకర్తలో లేదా టీడీపీ నేతలే రైతుల చేత మాట్లాడిస్తున్నారా..? అనేది ఇప్పుడు తెలియాల్సిన అంశం.

అమరావతి ఉద్యమం డిసెంబర్‌లోనే మొదలైంది. ఆ తర్వాత దాదాపు మూడు నెలలకు ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. అమరావతిలో నిజంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని భావిస్తున్న ఉద్యమ రైతులకు విచారణను టీడీపీ నేతలు ఎందుకు అడ్డుకోవాలని కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారో ఇప్పటికైనా అర్థం అవుతుందా..? తాజాగా చంద్రబాబు ప్రభుత్వంలో అడ్వకేట్‌ జనరల్‌గా పని చేసిన దమ్మలపాటి శ్రీనివాస్‌ కూడా అమరావతి భూ కుంభకోణంపై విచారణ జరపవద్దు, సీబీఐ విచారణకు సమ్మతిని తెలియజేస్తూ రాష్ట్ర హోం శాఖ కేంద్రానికి రాసిన లేఖను కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనను అరెస్ట్‌ చేయవద్దని కూడా ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్‌లో కోరారు. మరి దీన్ని అమరావతి రైతులు ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూడాలి.

తప్పు చేయనివాడు ఏ విచారణకైనా సిద్ధపడతాడు. రాజకీయ కక్షతో కేసులు పెట్టి విచారణ జరిపితే ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది. ఆరోపణలు ఎదుర్కొన్న వారికి చివరికి మేలే జరుగుతుంది. కానీ విచారణే వద్దు అంటే.. అసలు ఏమి జరిగిందో సామాన్యుడుకైనా అర్థం అవుతుంది. కానీ ఈ విషయం అమరావతిలో ఉద్యమం చేస్తున్న నాలుగు గ్రామాల రైతులకు మాత్రం తెలియదనుకోవడం పొరపాటే అవుతుంది. భూములు ఇచ్చిన రైతులపై అందరికీ సానుభూతి ఉంది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తేనే.. అసలు ఉద్యమం రైతులదా..? లేక తెలుగుదేశం పార్టీదా..? అని ఉన్న అనుమానాలు ఇంకా బలపడే అవకాశం ఉంది.

అమరావతిలో ఉద్యమం చేస్తున్న రైతులు ఇప్పుడు చేయాల్సిన పని.. ఇన్‌సైడర్‌ జరగనప్పుడు ఏ విచారణ చేస్తే వచ్చే నష్టం ఏమిటి..? మీరు కోర్టులకు వెళ్లి విచారణను అడ్డుకోవద్దని.. చంద్రబాబు సహా టీడీపీ నేతలకు, మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మలపాటి శ్రీనివాస్‌కు ధైర్యం చెప్పి వారు వేసిన పిటిషన్లను ఉపసంహరించుకునేలా చేయడమే. ఇలా చేస్తే.. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందా..? లేదా..? అనేది వేగంగా తేలుతుంది. నిజంగా అమరావతిలో భూ కుంభకోణం జరగలేదని తేలితే.. అది అమరావతి ఉద్యమానికి వజ్రాయుథం అవుతుంది. మరి ఉద్యమం చేస్తున్న వారు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై చంద్రబాబు అండ్‌ కోను ఒప్పిస్తారా..? లేదా..? అనేది చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి