iDreamPost

పేరెంట్స్‌ తస్మాత్‌ జాగ్రత్త!.. కొత్త రకం మత్తులో పిల్లలు!

పేరెంట్స్‌ తస్మాత్‌ జాగ్రత్త!.. కొత్త రకం మత్తులో పిల్లలు!

దేశంలోని ప్రధాన నగరాల్లోని యువత మత్తుకు చిత్తవుతోంది. ఆడ, మగ అన్న తేడా లేకుండా డ్రగ్స్‌, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్నారు. మాదక ద్రవ్యాల రవాణా, వాడకాన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు, పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతోంది. పోలీసుల కళ్లు గప్పి స్మగ్లర్లు మాదక ద్రవ్యాల దందా నిర్వహిస్తున్నారు. నిన్నటి వరకు యువతనే టార్గెట్‌ చేసిన డ్రగ్స్‌ గ్యాంగులు ఇప్పుడు చిన్నారులను టార్గెట్‌ చేస్తున్నాయి. స్కూలు పిల్లలు సైతం మాదక ద్రవ్యాలను విచ్చలవిడిగా వాడుతున్నారు.

చాక్లెట్లు, ఐస్‌ క్రీంల రూపంలో డ్రగ్స్‌ విచ్చలవిడిగా అందుబాటులో ఉంటున్నాయి. పోలీసు శాఖ వీటిని అరికట్టే పనిలో ఉండగా.. ఇప్పుడో కొత్తరకం దందా మొదలైంది. ఈ సిగరెట్లు తల నొప్పిగా మారాయి. చాలా మంది చిన్నారులు ఈ సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. స్కూళ్ల పరిసర ప్రాంతాల్లో ఈ సిగరెట్ల కొనుగోలు, అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. తక్కువ ధరకు ఇవి లభిస్తుండటంతో పిల్లలు వీటిని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీటి ధర మార్కెట్‌లో 150 నుంచి 300 రూపాయల వరకు ఉంటోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ఈ సిగరెట్ల వాడకం ఎక్కువగా ఉంది.

రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్‌ వంటి ప్రాంతాల్లో ఈ సిగరెట్లు వాడకం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సైబర్‌ ఎస్వోటీ పోలీసులు సైలెంట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ సిగరెట్లు తాగుతున్నా వారిని పట్టుకున్నారు. అంతేకాదు! ఈ సిగరెట్లు గానీ, మత్తు పదార్థాలతో గానీ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసాంఘీక పనులకు అడ్డాగా మారుతున్న ప్రాంతాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. మరి, పిల్లలను మత్తులో చిత్తు చేస్తున్న ఈ సిగరెట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి