iDreamPost

కాంగ్రెస్ తో బంధం తెంచుకోనున్న అహ్మద్ పటేల్ కొడుకు?

కాంగ్రెస్ తో బంధం తెంచుకోనున్న అహ్మద్ పటేల్ కొడుకు?

ఐదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్.. ఆ పరాభవం నుంచి తేరుకుని మళ్లీ గాడిలో పడేందుకు ఆపసోపాలు పడుతోంది. మరోవైపు ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటినుంచే దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ స్వరాష్ట్రమైన గుజరాత్లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆరాటపడుతోంది. అందుకోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నే మళ్లీ రంగంలోకి దించింది. 27 ఏళ్లుగా గుజరాత్ లో అధికారానికి నోచుకోని కాంగ్రెసుకు ఎలాగైనా గెలుపు రుచి చూపించాలన్న పట్టుదలతో ఆయన కూడా వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే తానొకటి తలిస్తే ఇంకొకటి జరుగుతున్నట్లు కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. రాష్ట్రంలో గట్టి పట్టు ఉన్న నేతలను పార్టీలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలు ఒకవైపు జరుగుతుంటే.. మరోవైపు ఉన్న నేతలు జారిపోయే పరిస్థితి నెలకొంది.

ప్రముఖ పాటీదార్ నేతను రప్పించేందుకు యత్నాలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయంతో సంబరం చేసుకుంటున్న బీజేపీని మోడీ స్వరాష్ట్రంలో ఎలాగైనా దెబ్బకొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో పాటీదార్ల ఓట్ బ్యాంక్ గణనీయంగా ఉన్నందున ఆ వర్గంపై దృష్టి సారించింది. గతంలో ఈ వర్గానికి చెందిన హార్ధిక పటేల్ ను పార్టీలో చేర్చుకుని కొంత ప్రయోజనం పొందిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లెవా పాటీదార్ల నేత నరేష్ పటేల్ ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు మంతనాలు జరుపుతోంది. రాజకోట్ సమీపంలో ఉన్న పాటీదార్ల కుల దేవత ఖోడియార్ కు చెందిన ఖోడల్డమ్ ట్రస్టుకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న నరేష్ పటేల్ కు పాటీదార్ వర్గంపై అపారమైన పట్టు ఉంది. కాంగ్రెసులో చేరేందుకు ఆయన పలు షరతులు విధిస్తున్నారు. వాటిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా.. ఆయన చేరిక వల్ల గట్టి మేలు జరుగుతుందని మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతో నరేష్ పటేల్ త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంటున్నారు.

వేరే దారిలో అహ్మద్ పటేల్ తనయుడు

ఒకవైపు పార్టీని ఎన్నికలకు సిద్ధంచేసే యత్నాలు జరుగుతుంటే మరోవైపు సీనియర్ నేత, దివంగత అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్ కాంగ్రెస్ నాయకత్వంపై బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ పోస్ట్ ద్వారా తన దారి తాను చూసుకుంటున్నట్లు వెల్లడించారు. ‘సుదీర్ఘ నిరీక్షణతో అలసిపోయాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా అగ్ర నాయకత్వం నుంచి ప్రోత్సాహం లేదు’ అని ట్విట్టర్ పోస్టు ద్వారా తన అసంతృప్తిని బహిర్గతపరిచారు. గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా, కాంగ్రెస్ జాతీయ వ్యవహారాల్లో దశాబ్దాల తరబడి కీలకపాత్ర పోషించిన అహ్మద్ పటేల్ అనారోగ్యంతో 2020లో కన్నుమూశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు తనను చిన్నచూపు చూస్తున్నాయని ఫైజల్ పటేల్ ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తాను వేరే దారి చూసుకోక తప్పడంలేదని ఆయన పరోక్షంగా పార్టీ మారనున్నట్లు వెల్లడించారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరేందుకు సిద్ధం అవుతున్నారని.. కొన్నాళ్ల క్రితం ఢిల్లీ వెళ్లి ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తో దీనిపై చర్చించారని సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి