iDreamPost

స్థానిక సంస్థల్లో పొత్తుల కోసం బాబు ఆరాటం

స్థానిక సంస్థల్లో పొత్తుల కోసం బాబు ఆరాటం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరిగి మునపటి రాజకీయాలు చేసేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో చంద్రబాబు హయాం మొదలైనప్పటి నుంచీ 2014 వరకు వివిధ రాజకీయ పార్టీలతో కలసి ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు తొలిసారి 2019లో ఒంటిరిగా పోటీ చేయాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మళ్లీ ఒంటరి పోరుకు వెళ్లకూడదని భావిస్తున్నట్లుగా ఉన్నారు. తిరిగి పూర్వపు విధానంలోనే పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నెలలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పొత్తుల ద్వారా ఎదుర్కొవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు ఆయన చర్యల ద్వారా తెలుస్తోంది. నిన్న గురువారం చంద్రబాబు సీపీఐ నేతలతో సమావేశమయ్యారు. వైఎస్సార్‌పీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరు జరపాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ.. చంద్రబాబుతో చెప్పినట్లు టీడీపీ ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది. కమ్యూనిస్టుల నుంచి పొత్తు ప్రతిపాదన వచ్చినట్లుగా చూపేందుకు టీడీపీ ఆసక్తి చూపుతోంది. మొన్న ఎన్నికల్లో ఒంటరి పోరు చేసి మళ్లీ 9 నెలలు తిరగకముందే పొత్తు పెట్టుకుంటే టీడీపీ పని అయిపోయిందన్న భావన రాజకీయ వర్గాల్లో రాకుండా చూసుకునేందుకు టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే తమతో పొత్తు కోసం సీపీఐ ప్రతిపాదన చేసినట్లుగా టీడీపీ చూపుతోందని పేర్కొంటున్నారు.

1995లో ఎన్టీ రామారావు నుంచి సీఎం పదవిని, టీడీపీ పార్టీని చేజిక్కించుకున్న చంద్రబాబు 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లి గెలిచారు. 2004లోనూ బీజేపీతో కలిసి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఆ నెపం బీజేపీపై నెట్టారు. ఇకపై బీజేపీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. 2009 ఎన్నికల్లో మహా కూటమి అంటూ కమ్యూనిస్టులు, టీఆర్‌ఎస్‌తో కలసి ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లోనూ ఓటమిపాలవడంతో.. మహా కూటమిలోని పార్టీలపైకి ఆ నెపం నెట్టారు. 2004లో చెప్పిన మాటలకు భిన్నంగా 2014లో తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జనసేన, బీజేపీ మద్ధతుతో గెలిచారు. 2019 ఎన్నికల్లో అధికారికంగా పొత్తు లేకపోయినా జనసేన పార్టీతో అంతర్గతంగా అవగాహన ఉన్నట్లు ఆ రెండు పార్టీలు పోటీ చేసిన స్థానాలు, ప్రచారం చేసిన విధానంతో అర్థం చేసుకోవచ్చు.

ఇక తాజా వ్యవహారానికి వస్తే.. ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు, సీపీఐ రామకృష్ణ సన్నిహితంగా మెలుగుతున్నారు. అనధికారిక పొత్తు అనే రీతిలో వారు నిర్వహించిన కార్యక్రమాలున్నాయి. ముఖ్యంగా రాజధాని అమరావతి ఉద్యమంలో రామకృష్ణ లేని చంద్రబాబును ఊహించలేం. 79 రోజుల అమరావతి ఉద్యమంలో చంద్రబాబు ఉన్న ప్రతి కార్యక్రమంలో సీపీఐ రామకృష్ణ ఆయన పక్కనే ఉన్నారు. చంద్రబాబు కన్నా రామకృష్ణే జగన్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, రామకృష్ణల స్నేహం ఇప్పుడు లోకల్‌ ఎన్నికల సందర్భంగా అధికారికంగా మారబోతుండడం విశేషం. గత ఎన్నికల్లో సీపీఐ జనసేతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి