iDreamPost

ఆ ఇంఛార్జీని మార్చాల్సిందే!

ఆ ఇంఛార్జీని మార్చాల్సిందే!

కర్నూలు జిల్లాలో ఒకప్పుడు గట్టి పట్టు కలిగిన తెలుగుదేశానికి ఆదోని నియోజకవర్గంలో మాత్రం మిశ్రమ ఫలితాలు లభించాయి. పార్టీ ఆవిర్భవించిన 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో నాలుగుసార్లే అక్కడ విజయం సాధించగలిగింది. అందులోనూ మూడుసార్లు మీనాక్షి నాయుడే ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికలతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చిత్తుగా ఓడిపోయి పతనావస్థకు చేరిన టీడీపీని అంతర్గత పోరు మరింత కుంగదీస్తోంది. పార్టీ ఇంఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడిపై ఆయన మాజీ అనుచరులు, సహచరులు తిరుగుబాటు జెండా ఎగురవేసి అసమ్మతి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మీనాక్షి నాయుడిని అన్ని బాధ్యతల నుంచి తప్పించి వేరొకరికి బాధ్యతలు అప్పగించాలని నేరుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకే ఫిర్యాదు చేశారు.

అనుచరులే అసమ్మతి వర్గంగా

ఆదోనిలో మూడు దశాబ్దాలుగా మీనాక్షి నాయుడు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. 1994, 1999, 2009 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2014, 2019 ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్సీపీ నేత వై.సాయిప్రసాద్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. పార్టీ కూడా క్రమంగా పట్టు కోల్పోతూ వచ్చింది. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చిత్తుగా ఓడిపోయింది. నియోజకవర్గ కేంద్రమైన ఆదోని మున్సిపాలిటీలో 42 వార్డులకు కేవలం ఒక్క వార్డులోనే గెలిచింది. ఇక పంచాయతీ ఎన్నికల్లో 5, ఎంపీటీసీల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. ఈ దుస్థితికి మీనాక్షి నాయుడు కుటుంబమే కారణమని అసమ్మతివర్గం ఆరోపిస్తోంది. ఒకప్పుడు మీనాక్షి నాయుడికి అనుచరులుగా, సహచరులుగా ఉన్న ఆదోని మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు మధిర భాస్కర్ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, తుంగభద్ర దిగువ కాలువ ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ రామస్వామి, గుజరి రావూఫ్ తదితరులు మాజీ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంగా ఏర్పడ్డారు.

చంద్రబాబుకు ఫిర్యాదు

గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి పార్టీ ఇంఛార్జిగా కొనసాగుతున్న మీనాక్షి నాయుడు పార్టీని పట్టించుకోవడం లేదని అసమ్మతివర్గం ఆరోపిస్తోంది. కార్యకర్తలను చిన్నచూపు చూస్తున్నారని, అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారని పార్టీ అధినేత చంద్రబాబుకే అసమ్మతి నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానే అన్నట్లు పెత్తనం చేసిన మీనాక్షి నాయుడు సోదరుడు ఉమాపతి అధికారం కోల్పోయాక పత్తాలేకుండా పోయారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ బతికి బట్ట కట్టాలంటే అతన్ని ఇంఛార్జి పదవి నుంచి తప్పించి వేరొకరికి బాధ్యతలు అప్పగించాలని, ఎమ్మెల్యే టికెట్ కూడా మీనాక్షి నాయుడుకు ఇవ్వరాదని డిమాండ్ చేశారు. ఇంఛార్జిపై అసంతృప్తితో కొన్నాళ్లుగా అసమ్మతి నేతలు పార్టీ కార్యక్రమాలను కూడా విడిగా నిర్వహిస్తున్నారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం, చంద్రబాబు జన్మదినోత్సవ కార్యక్రమాలను ఇంఛార్జీతో సంబంధం లేకుండా నిర్వహించారు. కాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీనాక్షి నాయుడుకి కొమ్ముకాస్తున్నారు. ఇంఛార్జీని తప్పించాలని డిమాండ్ చేస్తున్న అసమ్మతి నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. దాంతో వారంతా నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి