iDreamPost

హీరోల గురించి రాస్తే మీ కాళ్ళు విరగ్గొడతారు: జయసుధ

Actress Jayasudha Comments: ఏ విషయం అయినా.. నిర్మొహమాటంగా మాట్లాడడం నిక్కచ్చిగా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడం సహజనటి జయసుధకి అలవాటు.

Actress Jayasudha Comments: ఏ విషయం అయినా.. నిర్మొహమాటంగా మాట్లాడడం నిక్కచ్చిగా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడం సహజనటి జయసుధకి అలవాటు.

హీరోల గురించి రాస్తే మీ కాళ్ళు విరగ్గొడతారు: జయసుధ

నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడం సహజనటి జయసుథకి మొదట్నించీ అలవాటు. దాపరికం లేకుండా మనసులో మాటని బైట పెట్టగల సహజస్వభావి. అందుకే ఆమెకెప్పుడూ చిత్రపరిశ్రమలో కూడా మంచి గుర్తింపు. విమన్స్ డే సందర్భంగా ఐ డ్రీమ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో జయసుథ పదేపదే ‘’సోషల్ మీడియా, సోషల్ మీడియా’’ అని వల్లించారు. ఇంటర్వ్యూలో భాగంగా ‘ఆడవాళ్ళనైతే ప్రతీది అడుగుతారు. మేమేదో సమాధానం చెబితే దానిని మళ్ళీ సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా రాసి వైరల్ చేయడానికి ప్రయత్నిస్తారు. అదే ప్రతీసారీ జరుగుతోంది. మమ్మల్నైతే అన్నీ అడుగుతారు. హీరోలనైతే ఏమీ అడగ లేరు. వాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి రాసినట్టు రాయనూ లేరు. ఎందుకంటే హీరోల గురించి రాయడానికి గట్స్ ఉండవు. ఒకవేళ రాసినా, వాళ్ళ అభిమానులు కాళ్ళు విరగ్గొడతారు.’’అని అన్నారు.

కమల్ హసన్ తో ఎఫైర్ నిజమేనా?

కమల్ హసన్, జయసుథ కాంబోలో చాలా సినిమాలొచ్చాయి. ఇది కథ కాదు, అపూర్వ రాగంగళ్, సొమ్మొకడిది సోకొకడిది…ఇలా చాలానే చేశారు. ఇద్దరూ దాదాపుగా ఒకేసారి కెరీర్లు ప్రారంభించారు. అందుకని ఎర్లీ డేస్ లో జయసుథకి, కమల్ హసన్ కీ మధ్యన ఎఫైర్ నడిచిందని మద్రాసు ఇండస్ట్రీలో పెద్ద టాకే నడిచింది.తమిళ పేపర్లు కూడా రాశాయి. అదే విషయం గురించి ఐ డ్రీమ్ అడిగితే’’ ఇప్పుడది దేశానికి అవసరమా? మేమిద్దరం స్టేజెస్ మీద పాటలు పాడేవాళ్ళం. కమల్ చాలా బాగా పాడతాడు. నాకు పెద్దగా రాకపోయినా కమల్ తో పాడుతున్నప్పుడు మాత్రం వచ్చేసేది. అప్పుడు చాలా మంది అనుకున్నారు. ఇద్దరం ఈడూజోడూలా కనిపిస్తున్నామని, మేమిద్దరం పెళ్ళి చేసుకుంటే బావుంటుందని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా మాధ్య మాత్రం అటువంటి వ్యవహారమేమీ నడవలేదు. కమల్ చాలా బాగుండేవాడు. నేను క్యూట్ గా ఉంటానని చెప్పేవారు. పైగా చాలా సినిమాలు కలసి చేశాం. అందుకు అటువంటి న్యూసేదో అప్పట్లో ప్రచారం జరిగింది’’ అని చెప్పారు.

ఎన్టీ ఆర్ కి హిందీ పాటలంటే చాలా ఇష్టం…పాడేవారు కూడా..

ఎన్టీ ఆర్ తో ఎక్కువ సినిమాలు చేసింది తనేనని జయసుథ చెప్పారు. అందులో మంచి హిట్స్ కూడా ఉన్నాయని జయసుథ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అడవిరాముడు, డ్రైవర్ రాముడు, లాయర్ విశ్వనాథ్, యుగంధర్, వేంకటేశ్వరకళ్యాణం ఇలా మంచిమంచి సినిమాలే చేశారు ఎన్టీఆర్ తో కలసి. అ అనుభవాలను గుర్తు చేసుకుంటూ ‘’ఎన్టీ ఆర్ తో చేయడమంటే మొదట్లో భయమేసేది. మా నాన్నగారి కన్నా కూడా ఆయన పెద్దాయన. నాగేశ్వరరావుగారు కూడా. ఎన్టీ ఆర్ గారితో ఎక్కువ సినిమాలు నేనే చేశాను. ఆయన సొంతబ్యానర్ మీద తీసిన సినిమాలు డ్రైవర్ రాముడు, అనురాగదేవతలో కూడా నేనే హీరోయిన్ని. అనురాగదేవతలో శ్రీదేవి కూడా చేసింది. ఆయనతో కంపెనీ చాలా బావుండేది. ఆయనకి హిందీ పాటలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పాడడం ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక పాట…అదీ ఆ సీజన్లో ఏ పాటైతే ట్రెండింగ్లో ఉండేదో అదే పాట పాడేవారు. దమ్మరోదమ్ పాట పదేపదే పాడుతుండేవారు. మేమున్నప్పుడు పాడడం కాదు. ఆయన పాడుతున్నప్పుడు మేముండేవాళ్ళం. ఆయనకి బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ సి. రామచంద్ర. అందుకే ఆయన్ని తీసుకొచ్చి అక్బర్ సలీం అనార్కలి సినిమా ఇచ్చారు. అన్ని సినిమాలు ఒకెత్తు. ఆయనతో చేసిన పౌరాణికం సినిమా ఒక్కటీ ఒకెత్తు. నాకేమో ఆ గ్రాంధికం డైలాగులు వచ్చేవి కావు. పైగా చేసిందేమ్ లక్ష్మీదేవీ క్యారెక్టర్. బాలక్రిష్ణ నారదుడు. ఆయనేదో బాగానే లాగించేశాడు. నా వల్ల మాత్రం కాలేదు. అందుకే నాకు రామారావుగారు డబ్బింగ్ చెప్పించారు. అన్ని సినిమాలు చేసిన నాకు డబ్బింగేంటి….అదే మరి. సహజనటి అంటే లక్ష్మీదేవి క్యారెక్టర్ కూడా సహజంగా ఉంటుందా? నాకు చెప్పి మరీ డబ్బింగ్ చెప్పించారు.’’ అని గుర్తు చేసుకున్నారు.

నాగేశ్వరరావుగారితో ఆ విషయంలో పడేదికాదు

‘’నాగేశ్వరరావుగారితో చాలా ఈజీగా ఉండేది. ఆయనో యూనివర్సిటీ. ఆయనకి తెలియని విషయం ఉండేది కాదు. ప్రతీ విషయంలోనూ ఆయనకి క్లియర్ నాలెడ్జ్ ఉండేది. దేవుడున్నాడా లేదా అని మా ఇద్దరి మధ్య ఎప్పుడూ డిస్కషన్ జరుగుతుండేది. ఆయన ఒప్పుకునేవారు కాదు. నేను ఉన్నాడని మాట్లాడుతుంటే నా చేత మతమార్పిడి చేయించొద్దు అని అనేవారు. మతమార్పిడి అంటే ఆయన నాస్తికలు. దేవుడు మీద నమ్మకం లేదు. కానీ ఒకరోజు మేమిద్దరం మాట్లాడుకుంటుంటే దేవడు ఎక్కడున్నాడు, ఇప్పుడొస్తాడా అని అన్నారు. ఆయనలా అన్నారో లేదో….ఒకరెవరో ఇప్పుడు గుర్తు లేదు, వచ్చి తిరుపతి ప్రసాదం లడ్డూ తెచ్చి ఇచ్చారు. ఆయన ఒక్కసారి స్టన్ అయ్యారు. నాకు నవ్వాగలేదు.అని నాగేశ్వరరావుతో మూమెంట్స్ ని నెమరువేసుకున్నారు జయసుథ
అవకాశాల కోసం ఎవ్వరినీ అడుక్కోలేదు.  నేనొచ్చిందే మా ఆంటీ విజయనిర్మలగారి ప్రోత్సాహంతో పండంటి కాపురం చిత్రంలో పరిచయం అయ్యాను. వాళ్ళే పెద్ద బ్యాక్ గ్రౌండ్. పైగా పండంటి కాపురం పెద్ద హిట్. అది బాగా ప్లస్ అయింది సెంటిమెంటల్ గా. అవకాశాలు వాటంతటవే వచ్చాయి గానీ, నేనెవరి అఫీసులకి వెళ్ళి అవకాశాలిమ్మని అడగలేదు.అప్పట్లో రామానాయుడుగారు, డివియస్ రాజుగారు…వాళ్ళిద్దరి ఆఫీసులకు మాత్రం వెళ్ళాను. తమిళంలో అయితే కొత్తవాళ్ళతో బాలచందర్ గారు చేశారు కాబట్టి ఆయనని కలిశాను. నేనూ కమల్ రజనీకాంత్ మేమంతా ఆయన స్కూలు స్టూడెంట్స్.

శోభన్ బాబుగారు నన్ను రిక్మండ్ చేసేవారు

ఆంధ్రుల అందాల జంట అని శోభన్ బాబు, జయసుథ కాంబినేషన్కి పేరుండేది. ఆ విషయమే జయసుథ ఐ డ్రీమ్ తో షేర్ చేసుకుంటున్నప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. ‘’నన్ను కలవడానికి ఆయనే వచ్చారు. ఓ సారి విజయవాహినీలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయనా ఆ పక్కగా వెళ్తూ, నన్ను చూసి ఆయనే నడుచుకుంటూ నా దగ్గరకి వచ్చి నాతో మాట్లాడారు. ఆ ముమెంట్ ఎన్నటికీ మరచిపోలేను. ప్రతీ విషయాన్ని లైటర్ వెయిన్లో జోక్ చేసి, బాగా ఎంటర్ టైన్ చేసేవారు శోభన్ బాబు. ఆయనతో నేను చేసిన మెదటి సినిమా సోగ్గాడు. తర్వాత ఎన్నో హిట్స్ లో నటించాం. తర్వాత రాజు వెడలె సినిమాకి ముందు బుక్ చేసింది మంజులగారిని. కానీ అప్పుడావిడ తమిళంలో బాగా బిజీగా ఉండేవారు. అందుకు డేట్స్ క్లాష్ వచ్చి, జయసుథ బావుంటుంది కదా జయసుథనే పెట్టండి అని చెప్పి రిక్మండ్ చేశారు. అలాగే శోభన్ బాబు కూడా నా పేరు చాలా సినిమాలకి రిక్మండ్ చేశారు.

వాణిశ్రీ గారంటే చాలా ఇష్టం

అప్పట్లో హీరోలే కాదు, టాప్ హీరోయిన్లు అనుకున్న వాణిశ్రీ, మంజులలాటి వాళ్ళు కూడా తనని సిఫార్స్ చేసేవారని, అందులో వాణిశ్రీ అంటే తనకి చాలా ఇష్టమని జయసుథ చెప్పారు. ‘’సావిత్రి గారి తర్వాత జయసుథ అంటారు. అలాగే వాణిశ్రీగారికి కూడా ఆ పేరుంది. వాణిశ్రీగారు చేసిన క్రిష్ణవేణి సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ ఎంత బాగా చేశారో. చాలా కష్టం కూడా ఆ క్యారెక్టర్ చేయడం. సైకలాజికల్ క్యారెక్టర్ అది. సైకలాజికల్లీ అప్సెట్ పాత్రలో ఆమె చేసిన పెరఫారమెన్స్ అసలు పోలికే లేదు. నేనూ అటువంటి సినిమా చేశాను. రాఘవేంద్రరావుగారు చాలా బాగా చేయించారు. అదే అమె కథ సినిమా. ఎంత సెన్సిబుల్ గా తీశారో. ఆయనకి ఆర్టిస్టులను ఎలా హేండిల్ చేయాలో తెలిసినట్టు మరెవరికీ తెలియదు. హీరోయిన్లయితే మరీను. ఉదయం రాగానే ముందు క్లోజప్స్ తీసేవారు. సాయంత్రం అవుతున్న కొద్దీ వీక్ అయిపోతుంది ఫేస్ అని. ప్రతీ విషయంలో అంత క్లారిటీ ఆయనకి.

నిజజీవితంలో చిరంజీవిగారికి నటించడం రాదు. అందులో దాసరి గ్రేట్

హేండ్సప్ సినిమా జయసుథ జీవితంలో ఓ పెద్ద మలుపు. డిజాస్టర్. దాంతోనే జయసుథ చాలా నష్టపోయారు. పైగా ఆందులో మెగాస్టార్ చిరంజీవి కూడా క్లైమాక్సులో వస్తారు. హేండ్సప్ సినిమా గురించి చెబుతూ ‘’ ఇంగ్లీష్ ఫిల్మ్ బేస్ తో చేసిన సినిమా హేండ్సప్. సినిమా తీస్తున్నామని ఏంటి ప్రొడ్యూసరమ్మగారు…నాకు వేషం లేదా అనడిగి నవ్వుతుండేవారు చిరంజీవిగారు. తర్వాత కథ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తెగ నవ్వుకున్నాం. అనుకోకుండా కథలో కూడా ఓ జెయింట్ ఇమేజ్ పర్సన్ వస్తాడు. అది చిరంజీవిగారైతే బావుటుందని అనుకుని అడిగితే ముందు ఆయన ఒప్పుకోలేదు. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లోనైతే పెద్ద హీరోలు గెస్ట్ అప్పీరియన్స్ అన్నది ఓ ఫ్యాషన్. కానీ మనకి తెలుగులో అంత లేటెస్ట్ ట్రెండ్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రాదు. నాకేదో వేషాల్లేక ఈ వేషం చేస్తున్నానని అనుకుంటారు నన్ను అన్నారు చిరంజీవిగారు. ఇంక మా రిక్వెస్టుని కాదనలేక చేశారు. ఆయనే కరెక్టు. చిరంజీవిగారు సినిమాలో ఉన్నారంటే ఆయనెప్పుడు వస్తారా అని చూడ్డంపనిలోనే ఉంటారు ఆడియన్స్. దాని వల్ల సినిమాకి బేడ్ జరుగుతుందని చిరంజీవిగారు చెప్పారు. పోస్టర్ల మీద కూడా తనని వేయద్దని సలహా ఇచ్చారు. సరే సినిమా పూర్తయింది. ఆయనకి ఓ షో వేసి చూపించాం. సినిమా అయిపోయాక బైటకొచ్చి అదోలా పెట్టారు పేస్ చిరంజీవిగారు. తర్వాత మాట్లాడతానులే అని ఇబ్బందిగా వెళ్ళిపోయారు. అప్పుడే అర్ధమైపోయింది నాకు. తర్వాత ఫోన్ చేసి ఏంటిది, మనం కథ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంది, ఎంత బావుంది, అదేమీ సినిమాలో రాలేదు అని చెప్పి నిర్మొహమాటంగా చెప్పేశారు.ఆయనకి నిజజీవితంలో అస్సలు నటించడం రాదు. అదే దాసరిగారైతేనా…అసలు మాకే ఆయన మాటలకి కళ్ళు తిరిగేవి. ఆయన మంచి నటుడు జీవితంలో కూడా.’’ అని నవ్వుతూ చెప్పారు జయసుథ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి