iDreamPost

Acharya ఇంత అవమానమా ఆచార్యా

Acharya ఇంత అవమానమా ఆచార్యా

బహుశా చిరంజీవి యాంటీ ఫ్యాన్స్ కూడా ఇంతటి డిజాస్టర్ ని ఊహించలేదన్నది వాస్తవం. ఆచార్య పరిస్థితి బాక్సాఫీస్ వద్ద మరీ దారుణంగా ఉంది. కలెక్షన్లు రోజురోజుకు దిగజారిపోవడం మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమాలు బాగుండకపోవడం ఏ హీరోకైనా కొత్త కాదు. అందులోనూ మెగాస్టార్ లాంటి అగ్రనటుడికి ఇవన్నీ మాములే. కానీ ఆచార్య విషయంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం తీవ్రమైన షాక్ కలిగిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్, మూడేళ్లు గ్యాప్ తీసుకుని చిరంజీవి కలిసి నటిస్తే వచ్చే స్పందన ఇదా అంటూ సోషల్ మీడియాలో దీని మీద రకరకాలుగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.

ఉదాహరణకు నిన్న ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో సాయంత్రం ఆటకు కెజిఎఫ్ 2 సుమారు 1 లక్ష 30 వేల పైచిలుకు కలెక్షన్ రాబడితే అదే జంక్షన్ లో ఉన్న ఆచార్య మెయిన్ థియేటర్ ఓ పది వేలు అటుఇటు అంతే మొత్తం కలెక్ట్ ఆందోళన కలిగించే అంశం. ఆర్ఆర్ఆర్ సైతం లక్షా పది వేలకు పైగా వసూలు చేసింది. అంటే నెల క్రితం వచ్చిన సినిమాల కన్నా చిరంజీవి బొమ్మ మూడో రోజు అంతే తెచ్చుకోవడం అవమానమే. ఇవాళ నుంచి ఆచార్య మరణ శయ్య మీద ఉన్నట్టే. ఎన్ని సెంటర్లలో డెఫిషిట్లు వస్తాయో ఊహించుకోవడం కష్టం. నిన్న సెలవు రోజే అయినప్పటికి చాలా మల్టీ ప్లెక్సుల్లో తొమ్మిది లోపు ప్లాన్ చేసుకున్న షోలను క్యాన్సిల్ చేశారు.

ఆచార్య ప్యాన్ ఇండియా రిలీజ్ కాదు. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే విడుదల చేశారు. అయినా కూడా వంద కోట్ల దాకా నష్టం ఉండొచ్చన్న అంచనా గుబులు పుట్టిస్తోంది. సుమారు 40 కోట్లకు తెలంగాణ హక్కులు కొన్న వరంగల్ శీనుకు సగానికి పైగా పోతుందని ట్రేడ్ చెబుతోంది. అన్ని ఏరియాలలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. 132 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో బరిలోకి దిగిన ఆచార్య డిస్ట్రిబ్యూటర్లు త్వరలో నిర్మాతను కలిసి నష్టపరిహారం అడుగుతారనే వార్త పంపిణివర్గాల్లో ఉంది. పైకి ఎలా కనిపించినా కొడుకుతో కలిసి నటించిన సినిమాకు ఇంత పరాభవం జరగడం చిరంజీవి అంత సులభంగా మర్చిపోతారని అనుకోలేం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి