iDreamPost

చంద్రబాబు బండారాన్ని బట్టబయలు చేసిన అచ్చెం నాయుడు

చంద్రబాబు  బండారాన్ని బట్టబయలు చేసిన అచ్చెం నాయుడు

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు అరెస్ట్‌పై ఉదయం నుంచి నానా హంగామా చేసిన చంద్రబాబు.. ఇప్పుడు నాలుక కరుచుకునే పరిస్థితికి వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ఉదయం నుంచి నానా యాగీ చేసిన చంద్రబాబు అండ్‌ టీంకి చెంపచెల్లుమనిపించేలా అచ్చెం నాయుడు సమాధానం ఇచ్చారు. ఉదయం నుంచి చంద్రబాబు చేసిన రచ్చ గురించి తెలిసి అన్నారో లేదా తెలియక అన్నారో గానీ అచ్చెం నాయుడు తన వ్యవహారంలో వాస్తవాలు చెప్పారు.

విజయవాడ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న అచ్చెం నాయుడుతో ఎలక్ట్రానిక్‌ మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో కార్యాలయంలోకి వెళుతూనే.. అచ్చెం నాయుడు మాట్లాడారు. ఏసీబీ అధికారులు రమ్మంటే వచ్చానని చెప్పారు. వచ్చే క్రమంలో ఇబ్బందులేమీ పడలేదని చెప్పారు. అధికారులు ఇబ్బంది పెట్టలేదన్నారు. వారు ఏమి అడుగుతారో చెప్పిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పి లోపలికి వెళ్లారు. ఆనారోగ్య సమస్యలపై వచ్చిన తర్వాత మాట్లాడతానని తెలిపారు.

అసలు విషయం పక్కదోవ పట్టించేందుకు, జరిగిన ఘటనను తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేదుకు చంద్రబాబు ఈ రోజు చేయని ప్రయత్నం అంటూ లేదు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, దేశంలోనే సీనియర్‌ నేతను అని చెప్పుకునే చంద్రబాబు.. ఓ గల్లీ లీడర్‌లా వ్యవహరించిన తీరు యావత్‌ రాష్ట్ర ప్రజలు చూసేలా అచ్చెం నాయుడే బట్టబయలు చేయడం విశేషం.

ఉదయం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన స్వగృహంలో అచ్చెం నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఏసీబీ కూడా రాతపూర్వకంగా ధృవీకరించింది. అయితే అచ్చెం నాయుడును కిడ్నాప్‌ చేశారంటూ చంద్రబాబు హంగామా చేశారు. ఇటీవల ఆపరేషన్‌ చేయించుకున్న అతని పట్ల దారుణంగా వ్యవహరించారని విమర్శించారు. కనీసం మందులు కూడా వేసుకోనీయలేదంటూ సానుభూతి కోసం ప్రయత్నాలు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ బాధ్యత వహించాలని, హోం మంత్రి రాజీనామా చేయాలని, డీజీపీ అచ్చెం నాయుడు ఆచూకీ తెలపాలని నానా యాగీ చేశారు.

ఆ ఎపిసోడ్‌ అయిపోయిన తర్వాత.. నోటీసులు ఇవ్వకుండానే అచ్చెంనాయుడును అరెస్ట్‌ చేశారంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. బీసీలపై దాడిగా అభివర్ణిస్తూ అచ్చెం నాయుడు వ్యవహారం రాజకీయ లబ్ధికి ఉపయోగించుకున్నారు. బాబును అనుసరించే టీడీపీనేతలు మీడియా ముందుకు వచ్చిన ఆయన చెప్పిన మాటలనే వల్లెవేశారు. ఇక అచ్చెం నాయుడు కుటుంబ సభ్యులు కూడా.. పోలీసులు గోడ దూకి వచ్చారంటూ మాట్లాడారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఉదయం నుంచి నానా యాగీ చేసిన చంద్రబాబు అండ్‌ టీంకి చెంపచెల్లుమనిపించేలా అచ్చెం నాయుడు సమాధానం ఇచ్చినట్లైంది. ఉదయం నుంచి చంద్రబాబు చేసిన రచ్చ గురించి తెలిసి అన్నారో లేదా తెలియక అన్నారో గానీ అచ్చెం నాయుడు తన వ్యవహారంలో వాస్తవాలు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు, అండ్‌ టీం ఎలా స్పందిస్తారో..? అచ్చెం నాయుడు వ్యాఖ్యలను ఏ విధంగా మలుస్తారో చూడాలి.

Read Also : అచ్చెం నాయుడి అరెస్ట్‌ – టీడీపీ లాభ నష్టాలు..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి