iDreamPost

రాజ్యసభకు క్రికెటర్ హర్భజన్ సింగ్

రాజ్యసభకు క్రికెటర్ హర్భజన్ సింగ్

పంజాబులో మరో క్రికెటర్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇప్పటికే రాజకీయాల్లో కొనసాగుతుండగా తాజాగా హర్భజన్ సింగ్ (భజ్జీ) రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో విజయం దుందుభి మోగించి ఢిల్లీ వెలుపల పంజాబులో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భజ్జీని రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. వచ్చేనెలలో రాష్ట్రంలో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటికి ఈ నెల 31న ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వీటిలో ఒక స్థానానికి తమ అభ్యర్థిగా భజ్జీని ఆప్ ఖరారు చేసింది. ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీలో 117 స్థానాలకు గాను 92 సీట్లు చేజిక్కించుకున్న ఆప్ ఆ సంఖ్యాబలంతో రాజ్యసభ స్థానాలను సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. దాంతో హర్భజన్ సింగ్ రాజ్యసభలో ప్రవేశించడం లాంఛన ప్రాయమే.

బీజేపీ, కాంగ్రెసుల్లో చేరుతారని గతంలో ప్రచారం

సుదీర్ఘకాలంపాటు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి, రిటైర్ అయిన హర్భజన్ రాజకీయరంగ ప్రవేశంపై చాన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇటీవలి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరనున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. ఒక సీనియర్ బీజేపీ నేత హర్భజన్ తోపాటు యువరాజ్ సింగ్ కూడా తమ పార్టీ వైపే ఉన్నారని ప్రకటించేశారు. అయితే అవన్నీ ఉత్తి పుకార్లేనని హర్భజన్ ఖండించారు. తర్వాత పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూతో కలవడం, ఫోటోలు దిగడం, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. కాంగ్రెసులో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. అవేవీ నిజంకాలేదు. చివరికి భజ్జీ ఒక చేత్తో రాజ్యసభ సభ్యత్వం, మరో చేత్తో ఆప్ సభ్యత్వం తీసుకుని రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.

రాష్ట్రంలో కీలక బాధ్యతలు

హర్భజన్ కు రాజ్యసభ అవకాశం ఇవ్వడంతోపాటు రాష్ట్రంలో క్రీడాభివృద్ధి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కు భజ్జీ సన్నిహిత స్నేహితుడు. ఆప్ విజయం సాధించిన తర్వాత ఆప్ కు, నా స్నేహితుడు భగవంత్ మాన్ కు హార్ధిక శుభాకాంక్షలు అంటూ హర్భజన్ ట్వీట్ చేశారు. ఆ స్నేహ బంధంతోనే మాన్ సీఎం అయిన వెంటనే హర్భజన్ కు రాజ్యసభ అవకాశం కల్పించారు. అలాగే రాష్ట్రంలో జలంధర్లో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ బాధ్యతలను ఆయనకే అప్పగించనున్నారు. జలంధర్లో స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని ఆప్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించే బాధ్యతలను కూడా హర్భజన్ కు అప్పగించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి