iDreamPost

వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లో పాక్‌పై భారత విజయంపై ఆత్మావలోకనం

వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లో పాక్‌పై భారత విజయంపై ఆత్మావలోకనం

తొమ్మిదేళ్ల క్రితం 2011 వన్డే ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్స్‌లో దాయాది దేశాలైన పాకిస్తాన్, ఇండియా పోటీ పడ్డాయి. అప్పటివరకూ ప్రపంచ కప్‌లో ఇరు జట్లు నాలుగుసార్లు తలపడగా భారతదేశం తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించింది.ఇదే రోజున జరిగిన సెమీ ఫైనల్స్‌లో పాక్‌పై సాధించిన విజయముతో 5-0 తో తన రికార్డును మెరుగుపరచుకుంది.

ఢాకాలో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్స్‌లో ఆఫ్రిది నాలుగు వికెట్లు పడగొట్టి వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌లను 112 పరుగులకు పరిమితం చేయగా పాక్ ఓపెనర్లు వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించడంతో 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. అహ్మదాబాద్‌లో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్స్‌లో యువరాజ్ సింగ్ ఆల్‌రౌండర్‌ ప్రతిభతో ఆసీస్‌ను భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది.దీంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే భారత్-పాక్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ షురూ అయింది.

పాక్ బౌలర్లకు ఎదురొడ్డి భారత్‌ను ఆదుకున్న క్రికెట్ గాడ్:

మొహాలిలోని బింద్రా స్టేడియంలో టాస్ నెగ్గి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు వీరేందర్ సెహ్వాగ్,సచిన్ శుభారంభాన్ని ఇచ్చారు.పాక్ పేసర్ ఉమర్ గుల్ ఒక ఓవర్లో సెహ్వాగ్ ఐదు ఫోర్లు బాదడంతో 5 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 47/0 పరుగులు. సెహ్వాగ్ అవుటైన వెంటనే మూడో స్థానంలో బ్యాటింగ్‌ దిగిన గంభీర్ 27 పరుగులు చెయ్యగా కోహ్లీ 9 పరుగులు చేసి వెనుదిరిగాడు.ఈ టోర్నీ మొదటి నుండి రాణిస్తున్న యువరాజ్ సింగ్ పరుగుల ఖాతా తెరవకుండానే రియాజ్‌ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా భారత్ కష్టాల పాలైంది.

ఈ దశలో పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న సచిన్ 115 బంతులలో 11 ఫోర్లతో 85 పరుగులు చేశాడు.ఈ క్రమంలో మూడు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి సచిన్ త్రుటిలో తప్పించుకున్నాడు.భారత ఇన్నింగ్స్ చివరలో నాటి కెప్టెన్ ధోని 42 బంతులలో 25, సురేశ్ రైనా 39 బంతులలో అజేయంగా 36 పరుగులు చేయడంతో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది.పాక్ బౌలర్ వహాబ్ రియాజ్ 10 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి భారత్‌ భారీ స్కోరు అడ్డుకట్ట వేశాడు.

బౌలర్ల సమిష్టి కృషితో విజయం సాధించిన భారత్:

భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాకిస్థాన్ లక్ష్య ఛేదనలో 231 పరుగులకే పరిమితమైంది.ఈమ్యాచ్‌లో బౌలింగ్ చేసిన భారత బౌలర్లందరూ తలో రెండు వికెట్లు కూల్చడం విశేషం. భారత ఫేస్ బౌలర్లు ఆశిష్ నెహ్రా (2/33),మునాఫ్ పటేల్ (2/40) అద్భుత బంతులను సంధించి పాక్ బ్యాట్స్‌మన్‌లను పరుగులు చేయకుండా కట్టడి చేసి ఒత్తిడి పెంచారు.మిగతా భారత బౌలర్లు జహీర్ ఖాన్ (2/58), హర్భజన్ సింగ్ (2/43), యువరాజ్ సింగ్ (2/57) కూడా పాక్ బ్యాట్స్‌మన్‌లకు క్రీజులో నిలదొక్కుకునే ఛాన్స్ ఇవ్వలేదు.ముఖ్యంగా పాక్ ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో హర్భజన్ సింగ్‌ని నాటి కెప్టెన్ ధోనీ ప్రయోగించిన తీరు విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

పాక్‌ బ్యాట్స్‌మన్‌లలో మిస్బా-ఉల్-హక్ 36 బంతులలో 5 ఫోర్లు,ఒక సిక్సర్‌తో 56 పరుగులు చెయ్యగా,మహమ్మద్ హఫీజ్ 59బంతులలో  ఏడు ఫోర్లతో 43 పరుగులు సాధించాడు. బ్యాటింగ్‌లో మిగతా పాక్ ఆటగాళ్లు ఎవరు చెప్పుకోదగ్గ స్థాయిలో పరుగులు సాధించలేదు. చివరకు పాకిస్థాన్ 49.5 ఓవర్లలోనే 231 పరుగులకి ఆలౌట్ కాగా 29 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ ముంబై వాంఖెడే స్టేడియంలో జరిగే ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. పాక్ బౌలర్లను కాచుకొని క్రీజ్‌లో పాతుకుపోయి 85 పరుగులు సాధించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.ఇప్పటివరకు ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లో టోర్నమెంట్‌లో దాయాది దేశాలు ఏడుసార్లు తలపడగా 7 మ్యాచ్లను భారత్ కైవసం చేసుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి