iDreamPost

కులవివక్షపై సరదా సినీఅస్త్రం – Nostalgia

కులవివక్షపై సరదా సినీఅస్త్రం – Nostalgia

ఇప్పుడంటే మనోభావాలు చాలా సున్నితంగా ఉన్నాయి కాబట్టి కులమతాలకు సంబంధించిన ఎలాంటి సబ్జెక్టు అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ అలాంటివేవి లేని 80 దశకంలో సున్నితమైన కుల వ్యవస్థ అంశం మీద సున్నితంగా సరదాగా ఆలోచింపజేసిన సినిమా ఒకటొచ్చింధి. దాని పేరు ‘నేనూ మీ వాడినే’. 1988 సంవత్సరంలో భాగ్య రాజా హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో తమిళ్ లో వచ్చిన ‘ఇదు నమ్మ ఆలు’కు తెలుగు డబ్బింగ్ రూపం ఇది. హీరోయిన్ శోభన.

వెనుకబడిన వర్గానికి చెందిన ఓ నిరుద్యోగి తన అవసరార్థం అగ్రహారంలోని పెద్ద సద్బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. భుక్తి కోసం అక్కడే ఉండి పోవాల్సి వస్తుంది. వాళ్ళమ్మాయిని ప్రేమించి పెళ్లి దాకా తీసుకొస్తాడు. ఎలాంటి దురుద్దేశం లేకపోయినా క్రమక్రమంగా తానుగా నిజం చెప్పలేని పరిస్థితులు వచ్చేస్తాయి. నిష్ఠనియమాలకు పేరుబడ్డ ఆ ఇంట్లో నుంచి ఇతను ఎలా బయటపడ్డాడు, వాస్తవం తెలిశాక ఆ బ్రాహ్మడు తీసుకున్న నిర్ణయం ఏమిటి, కాదన్న తన సామాజిక వర్గానికి ఏం సమాధానం చెప్పాడు అనేది తెరమీద చూడాలి.

సినిమా ఆద్యంతం మంచి కామెడీతో సాగుతుంది. ఎక్కడా వెకిలి హాస్యం లేకుండా ఎవరి భావాలను గాయపరిచే ఛాన్స్ ఇవ్వకుండా తెరకెక్కించిన తీరు విసుగు లేకుండా చూడనిస్తుంది. ముఖ్యంగా భాగ్య రాజ్ నటన నేను మీవాడినే స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళింది. తర్వాత సోమయాజులు గారి గురించి చెప్పుకోవచ్చు. పోత పోసిన సాంప్రదాయ వాదిగా తన పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. అగ్రహారంలోని వ్యవహారాలు చూపించిన తీరు ఆకట్టుకుంటూనే, సనాతనం పేరిట మనం పాటించే కొన్ని పద్దతుల గురించి ఇందులో కొన్ని వ్యంగ్యాస్త్రాలు ఉన్నాయి.

ఈ కథనే మక్కికి మక్కి 8 ఏళ్ళ తర్వాత 1996లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో మోహన్ బాబు, రమ్యకృష్ణ జంటగా రీమేక్ చేశారు. ఒరిజినల్ పాత్రను ఇక్కడా సోమయాజులు గారే చేశారు. కానీ డ్రామా కాస్తా శృతి మించడంతో ఆశించిన ఫలితం దక్కలేదు. నేనూ మీవాడినే తెలుగులోనూ చక్కగా ఆడింది. కొన్ని కథల సోల్ ని సరిగ్గా పట్టుకోకపోతే దెబ్బ తినడం ఖాయమని అదిరింది అల్లుడు నిరూపిస్తే భాషతో సంబంధం లేకుండా చక్కని అంశాన్ని జనరంజకంగా తీస్తే విజయం తధ్యమని నేనూ మీవాడినే నిరూపించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి