iDreamPost

నీట మునిగిన 30 అపార్ట్ మెంట్స్.. బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు

నీట మునిగిన 30 అపార్ట్ మెంట్స్.. బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. గత రాత్రి నుండి కుంభ వృష్టిగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆగకుండా పడుతున్న వర్షాలకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎటు వెళ్లలేని పరిస్థితులను చవిచూశారు. ఈ వానలకు పలు కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరద నీరు చేరింది. దీంతో బిక్కుబిక్కుమంటూ ఆ నీటితోనే గడుపుతున్నారు నివాసితులు. ఇదిలా ఉంటే మేడ్చల్ జిల్లాలోని మైసమ్మగూడలో వరద నీరు అపార్ట్ మెంట్స్‌లోకి చేరింది. 30 అపార్ట్ మెంట్లలో వరద నీరు చేరింది. ప్రతి అపార్ట్ మెంట్‌లో మొదటి అంతస్థు వరద నీటిలో మునిగింది. అక్కడ పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది.

మైసమ్మగూడ ప్రాంతంలో ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. అక్కడ చదువుకునే విద్యార్థులు సమీపంలోని అపార్ట్ మెంట్లలో నివసిస్తుంటారు. నీట మునిగిన 30 భవనాల్లో కూడా ఎక్కువగా ఇంజనీరింగ్ విద్యార్థులు, కాలేజీ సిబ్బంది ఉన్నారు. రాత్రికి రాత్రే కురిసిన కుంభవృష్టికి రోడ్లన్నీ జలమయమయ్యి.. ఆ వరద నీరు అపార్ట్ మెంట్ మొదటి అంతస్థు వరకు చేరే సరికి భయపడ్డ విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. కింద అంతస్థులోని విద్యార్థులంతా పై అంతస్థులకు వెళ్లి బిక్కుబిక్కుమంటూ గడిపారు. కాగా, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి నిలిచిపోయిన నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. అయితే గుండ్ల పోచంపల్లి చెరువుకు వెళ్లే మార్గంలో అపార్టు మెంట్లను నిర్మించడంతో.. వరద నీరు వాటిని ముంచెత్తుతోంది. ఇలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి