iDreamPost

పింఛన్ ఇప్పిస్తానని తీసుకెళ్లి.. పిల్లలు పుట్టకుండా చేశారు!

పింఛన్ ఇప్పిస్తానని తీసుకెళ్లి.. పిల్లలు పుట్టకుండా చేశారు!

ప్రైవేటు రంగంలో ఉన్నట్లుగానే కొన్ని ప్రభుత్వ పోస్టులు, పథకాల్లో కూడా టార్గెట్స్ ఉంటాయి. అందరికీ తెలిసిందే కదా.. టార్గెట్ అనగానే చెప్పిన సమయానికి చెప్పిన మొత్తంలో పని పూర్తి చేసేందుకు కిందా మీద పడుతూ పని చేస్తారు. అందరికీ ఉన్నట్లుగానే కుటుంబ నియంత్రణ అధికారులకు కూడా టార్గెట్ ఉంటుంది. ఇంతకాలంలో ఇన్ని సర్జరీలు పూర్తి చేయాలని. తమ టార్గెట్ పూర్తి చేసుకునేందుకు ఒక ఆశా వర్కర్ దారుణానికి పాల్పడింది. ఒక మూగ యువకుడిని పింఛన్ ఇప్పిస్తానని తీసుకెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది.

ఈ దారుణం తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి.. ఒడిశాలో జరిగింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం.. 26 ఏళ్ల గాంగదురువ అనే యువకుడు పుట్టుకతోనే మూగవాడు. అతను ఒడిశాలోని మత్తిలి సమితి మొహిపోధర్ పంచాయతీలో నివాసముంటాడు. అతను మూగవాడు కాబట్టి ఆశ వర్కర్ ఆగస్టు 3న అతని ఇంటికి వచ్చి పింఛన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పింది. అతడిని మత్తిలి సమితి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. అక్కడ అతనికి పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది. తర్వాత అతడిని ఇంటి వద్ద దిగబెట్టింది. అయితే యువకుడు మందులు వేసుకుంటూ ఉండగా తల్లికి అనుమానం వచ్చింది. ఎందుకు నువ్వు మాత్రలు వేసుకుంటున్నావ్ అంటూ నిలదీసింది.

గాంగదరువ జరిగిన విషయం మొత్తం తల్లికి వివరించాడు. ఆమె తమ బంధువులతో కలిసి ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. జిల్లా వైద్యాధికారి ప్రపుల్ల కుమార్ విచారణ జరిపిన తర్వాత ఆశా వర్కర్ తప్పు చేసినట్లు తేలితే.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విచారణ కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రి నుంచి ఒక బృందం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఇక్కడ ఇంకా బాధించే విషయం ఏంటంటే ఆ యువకుడు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కూడా కాని తన కుమారుడిని ఆశా వర్కర్ తమ స్వార్థం కోసం ఇలా చేసిందంటూ ఆ తల్లి విలపిస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ఈ విషయం తెలిసిన తర్వాత స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పెళ్లికాని యువకుడికి అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి