iDreamPost

14 రాజ్యసభ స్థానాల ఫలితాలు వెల్లడి.. గుజరాత్‌లో నిలిచిన కౌంటిగ్‌

14 రాజ్యసభ స్థానాల ఫలితాలు వెల్లడి.. గుజరాత్‌లో నిలిచిన కౌంటిగ్‌

దేశ వ్యాప్తంగా ఈ రోజు 18 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆయా స్థానాల్లో ముందుగా ఊహించిన విధంగానే అభ్యర్థులు విజయం సాధించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, మేఘాలయ, మణిపూర్, మిజోరంలలో 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలు వైసీపీ గెలుచుకోగా, మధ్యప్రదేశ్‌లో రెండు బీజేపీ, ఒక స్థానం కాంగ్రెస్‌ గెలుచుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్‌ యువ నేత జ్యోతిరాధిత్య సింధియా బీజేపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరో బీజేపీ నోత సోమర్‌ సింగ్‌ సోలాంకి ఎన్నియ్యారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ విజయం సాధించారు.

రాజస్థాన్ లో మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ రెండు సీట్లు, బీజేపీ ఒక స్థానం గెలుచుకున్నాయి. మణిపూర్‌లో ఏకైక సీటును బీజేపీ గెలుచుకుంది. మేఘాలయలో ఏకైక స్థానాన్ని అధికార నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ గెలుచుకుంది. మిజోరంలో బీజేపీ కూటమి అభ్యర్థికి షాక్‌ తగిలింది. ఇక్కడ ఎంఎన్‌ఎఫ్‌ అభ్యర్థి విజయం సాధించారు. బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఎంఎన్‌ఎఫ్‌ అభ్యర్థికి ఓటు వేయడం విశేషం. ఝార్ఖండ్‌లో అదికారంలో ఉన్న ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబు సోరేస్‌ విజయం సాధించారు. త్రిముఖ పోటీలో శిబు సొరేన్‌ ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించారు. శిబు సొరేన్‌కు 31 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రకాష్‌ 30, కాంగ్రెస్‌ అభ్యర్థి 18 ఓట్లు సాధించారు.

గుజరాత్‌లో కౌంటింగ్‌లో గందరగోళం నెలకొంది. ఇద్దరు బీజేపీ సభ్యులు బ్యాలెట్‌ పేపర్‌పై సరైన స్థానంలో టిక్‌ చేయకపోవడంతో ఆ ఓట్లను చెల్లనివిగా ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో కౌంటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయంపై ఏమి చేయాలన్న అంశంపై అధికారులు చర్చిస్తున్నారు. గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరిగింది. ఇరు పార్టీల మధ్య హోరా హోరీగా పోరు జరిగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి