iDreamPost

పంచాయతీలకు నిధుల గండం.. మురిగిపోయే దశలో రూ.2,200 కోట్లు..

పంచాయతీలకు నిధుల గండం.. మురిగిపోయే దశలో రూ.2,200 కోట్లు..

14వ ఆర్థిక సంఘం కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తోంది. 2016–17 ఆర్థిక ఏడాదిలో ప్రారంభమైన 14వ ఆర్థిక సంఘం.. ఐదేళ్ల కాలపరిమితి 2020–21 ఆర్థిక ఏడాదితో ముగుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి 15వ ఆర్థిక సంఘం అమలులోకి వస్తుంది. ఐదేళ్లపాటు 15వ ఆర్థిక సంఘం కొనసాగుతుంది.

పంచాయతీలకు ఆర్థిక సంఘం ఇచ్చే నిధులే కీలకం. పంచాయతీ జనాభా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాల ద్వారా ప్రతి ఏడాది రెండుసార్లు నిధులు మంజూరు చేస్తుంది. తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీల నిర్వహణ, అంతర్గత రహదారులు, వీధి దీపాలు తదితర పనులకు ఈ నిధులు ఖర్చు చేయవచ్చు.

14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీలకు ఇచ్చిన నిధులు ప్రస్తుతం 2,200 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ నిధులన్నీంటినీ ఈ నెలాఖరులోపు ఖర్చు చేయాలి. లేదంటే మురిగిపోతాయి. పనులు మొదలు పెట్టినా ఆ నిధులను ఖర్చు చేసుకోవచ్చు. పనులు మొదలు పెట్టాలంటే.. ఏ ఏ పనులు చేయాలో ముందు గుర్తించాలి, వాటికి అంచనాలు రూపొదించాలి, టెండర్లు పిలవాలి.. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉంది.

గత ఏడాది మార్చిలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పుడే ఎన్నికలు జరిగి ఉంటే.. పంచాయతీలకు పాలకమండళ్లు ఏర్పడేవి. పంచాయతీలో సమస్యల పరిష్కారం, మౌలిక వసతలు కల్పన, అభివృద్ధి పనులపై పాలక మండళ్లు దృష్టి పెట్టేవి. నిధులు ఖర్చు చేసేవి. కానీ ఎన్నికలు జరగకపోవడం వల్ల పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. గత నెలలో ఎన్నికలు జరిగినా.. కొన్ని పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంతో ప్రత్యేక అధికారులు పాలన కొనసాగుతూనే ఉంది. సోమవారం ఆయా మిగిలిన పంచాయతీలు, వార్డులకు ఎన్నికలు జరిగాయి. త్వరలో ప్రత్యేక అధికారుల పాలన ముగిసి.. అధికారాలు సర్పంచ్‌లకు రాబోతున్నాయి. అయితే ఆ లోపు సమయం ముగిసిపోతుంది.

ఉన్న నిధులు కూడా మురిగిపోతే.. పంచాయతీల ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. 13 వేలకు పైబడిన పంచాయతీలలో 2,200 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపట్టవచ్చు. ఆ నిధులు మురిగిపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రయత్నం గట్టిగానే చేస్తోంది. సదరు నిధులను వచ్చే ఆర్థిక ఏడాది (2021–22)కి బదలాయించాలని వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ వినతిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. మరో 15 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో.. నెలాఖరు లోపు కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని పంచాయతీ రాజ్‌ అధికారులు భావిస్తున్నారు.

Also Read : జగన్ సోషల్ ఇంజినీరింగ్ తెచ్చిన విజయం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి