iDreamPost

ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ‘ఉక్కు ప్రవీణ్’కే

ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ‘ఉక్కు ప్రవీణ్’కే

సుదీర్ఘకాలంగా క‌డ‌ప జిల్లా ఎప్పుడూ టీడీపీకి కొరుకుడుప‌డ‌ని జిల్లానే. గ‌తంలో ఒక్క సీటుతో అయినా స‌రిపెట్టుకుంటూ వ‌స్తోన్న టీడీపీకి గ‌త ఎన్నిక‌ల్లో ఆ ఒక్క సీటూ దక్కలేదు. జిల్లాలో బడానేతలు అని అనుకునేవారు ఎవరూ బయటకురాని పరిస్థితి. ఈ క్రమంలో జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు కసరత్తు ఊపందుకుంది.టీడీపీ అధినేత చంద్రబాబు 2023, 2024 సంవత్సరాల్లో ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించినా ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. అమరావతిలో జిల్లాల వారీగా సమర్థులైన అభ్యర్థుల అన్వేషణలో భాగంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పులివెందుల టీడీపీ అభ్యర్థిగా బి.టెక్‌ రవి, జమ్మలమడుగుకు భూపేష్‌రెడ్డి పేర్లను ప్రకటించారు.

ఇక తాజాగా ప్రొద్దుటూరు విషయంలో కూడా చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 1985 తర్వాత ఇక్క‌డ 2009లో మాత్ర‌మే టీడీపీ గెలిచింది. ముందునుంచి ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా, మ‌ల్లెల లింగారెడ్డి ఉన్నారు. ఈయ‌న 1999, 2004లో వ‌రుస‌గా ఓడిపోయాడు. 2009లో గెలిచి వ‌ర‌ద‌రాజులరెడ్డిని ఓడించారు. అయితే, అనూహ్యంగా జిల్లా రాజ‌కీయాల్లో 2014లో లింగారెడ్డిని కాద‌ని వ‌ర‌ద‌రాజులురెడ్డికి టీడీపీ టికెట్ లభించింది. అయితే, ఆయ‌న కూడా ఓడిపోయారు. దీంతో కాస్తో కూస్తో ఆశలు ఉన్న ఈ ప్రొద్దుటూరులో పార్టీని న‌డిపించే స‌మ‌ర్థుడు అయిన నాయ‌కుడు దొరుకుతాడా ? అనుకుంటోన్న టైంలో బాబుకు ఉక్కు ప్ర‌వీణ్‌రెడ్డి క‌నిపించాడు. ప్ర‌జా ఉద్య‌మాల్లో తిరుగులేని నేత‌గా ఉక్కు ప్ర‌వీణ్‌కు పేరుంది.

కడప స్టీల్ ప్లాంటు భిక్షకాదు రాయ‌ల‌సీమ బిడ్డ‌ల హ‌క్కు అంటూ గ‌తంలో ఈ నినాదం ఎత్తుకున్న ప్ర‌వీణ్ యువ‌త‌లో మంచిఫాలోయింగ్ సంపాదించాడు. క‌డ‌ప స్టీల్‌ప్లాంట్ సాధ‌నా స‌మితి అధ్య‌క్షుడిగా జిల్లా అంత‌టా క్రేజ్ తెచ్చుకున్నారు. క‌డ‌ప స్టీల్ ప్లాంట్ మాత్ర‌మే కాకుండా అనంత‌పురం ఎయిమ్స్, వెన‌క‌బ‌డిన రాయ‌ల‌సీమ అభివృద్ది కోసం ఆయ‌న ఎత్తుకున్న నినాదం సీమ‌లోనూ ఆయ‌న‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. క‌డ‌ప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఉద్య‌మం, ఆమ‌ర‌ణదీక్ష చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కు ప్ర‌వీణ్ పేరు వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఆయనను నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా నియమించిన బాబు ఈసారి టికెట్ కూడా ప్రకటించాడు. ఆయన క‌మ‌లాపురం మాజీ ఎమ్మెల్యే వీర‌శివారెడ్డి త‌మ్ముడి కొడుకు.. ఆర్థికంగా కూడా మంచి బలవంతుడు కావ‌డంతో చంద్రబాబు ఈయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇక్కడ తిరుగులేని నేతగా ఉన్న రాచ‌మల్లుపై ఈసారి ప్రవీణ్ ను గెలిపించుకుని తీసుకు వస్తే ఎమ్మెల్సీని చేస్తానని లింగారెడ్డికి హామీ ఇచ్చారు అని చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి