iDreamPost

నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల!

నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల!

ప్రజా సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ముఖ్యంగా మహిళల సాధికారత, చేయూత, రక్షణ విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. ఈ నేపథ్యంలోనే పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పేరిట అన్ని వర్గాల పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం ఆర్థిక సాయం చేస్తోంది. ప్రతీ ఏటా ఈ మేరకు పేదింటి ఆడపిల్లల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోంది.

ఇక, 2023 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు 141.60 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం బుధవారం అర్హుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది. అది కూడా వధువు తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు వెళ్లనున్నాయి. ఇక, గడిచిన 9 నెలల్లో వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద దాదాపు 35,551 మంది లబ్ధిదారుల ఖాతాల్లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం డబ్బులు  జమచేసింది. అర్హులకు దాదాపు 267.20 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించింది.

దూదేకుల, నూర్‌ భాషాల విజ్ఞప్తిని మన్నించి వారికి కూడా షాదీ తోఫాతో సమానంగా సాయాన్ని లక్ష రూపాయలకు పెంచి అందిస్తోంది. ఎస్సీలకు వైఎస్సార్‌ కల్యాణ మస్తు కింద లక్ష సాయం చేస్తోంది. ఎ‍స్సీ కులాంతర వివాహం చేసుకున్న వారికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని 1,20,000 రూపాయలకు పెంచి అందిస్తోంది. షాదీ తోఫా కింద మైనారిటీ వర్గాలకు కూడా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందుతోంది. ఎస్టీలకు లక్ష, ఎస్‌టీ కులాంతర వివాహాలకు సాయాన్ని పెంచి 1,20,000 రూపాయలు అందిస్తోంది. మరి, ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద ఆర్థిక సాయం అందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి