iDreamPost

లాక్ డౌన్ వేళ విజయమ్మ గారి సేవా తత్వం..

లాక్ డౌన్ వేళ విజయమ్మ గారి సేవా తత్వం..

వైఎస్ విజ‌య‌మ్మ‌. ఓ మ‌హిళ‌గా అష్ట‌క‌ష్టాలు ప‌డి నిల‌దొక్కుకున్న నాయ‌కురాలు. ఓ మాజీ ముఖ్య‌మంత్రి భార్య‌గానే కాకుండా ఉమ్మ‌డి రాష్ట్ర‌ శాస‌న‌స‌భ‌లో ఓ పార్టీకి శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా కూడా ఆమె వ్య‌వ‌హ‌రించారు. వైఎస్సార్ హ‌యంలో పెద్ద‌గా తెర‌మీద క‌నిపించ‌ని విజ‌యమ్మ ఆ త‌ర్వాత అనేక కీల‌క పాత్ర‌లు పోషించారు. ముఖ్యంగా భ‌ర్త మ‌ర‌ణం త‌ర్వాత త‌న‌యుడికి తానే తోడ‌య్యారు. పులివెందుల ఎమ్మెల్యేగానూ, వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో ఎల్పీ లీడ‌ర్ గానూ బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత వైఎస్సార్సీపీ గౌర‌వాధ్య‌క్షురాలి హోదాలో జ‌గ‌న్ కి తోడుగా అన్ని విష‌యాల్లోనూ వ్య‌వ‌హ‌రించారు. జ‌గ‌న్ జైలు పాల‌యిన స‌మ‌యంలో పార్టీ ప్ర‌చార బాధ్య‌త‌లను కూడా వైఎస్ ష‌ర్మిళ‌తో క‌లిసి పంచుకున్నారు. 2012 ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. ఇక 2014,2019 ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీకి ప్ర‌చారం చేసి పార్టీ విజ‌యంలో భూమిక పోషించారు.

ప్ర‌తిప‌క్షంలో ఉన్నంత కాలంలో అనేక ఆందోళ‌నల స‌మ‌యంలో జ‌గ‌న్ ప‌క్క‌న క‌నిపించిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు నిర్వ‌హించిన ఏడాది కాలంగా ఆమె పేరు పెద్ద‌గా వినిపించ‌డం లేదు. ఆమె కూడా ప్ర‌చారానికి ప్రాధాన్య‌త‌నివ్వ‌కుండా త‌న ప‌ని తాను చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల గురించి మాత్ర‌మే అంద‌రికీ తెలిసిన విజ‌య‌మ్మ మ‌రోకోణం చాలామందికి తెలియ‌దు. ఇటీవ‌ల లాక్ డౌన్ కార‌ణంగా విజ‌య‌వాడ కృష్ణా న‌ది ఘాట్ ల‌లో దిన‌కర్మ‌లు నిర్వ‌హించే వారికి ఉపాధి లేక అల్లాడిపోతుండ‌డం ప‌ట్ల ఆమె స్పందించారు. నేరుగా మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ తో ఆమె మాట్లాడారు. అలాంటి వారిని ఆదుకోవాల‌ని కోరారు. దాంతో అనేక మంది పెద్ద‌గా ప‌ట్టించుకోని వంద‌ల మంది బ్రాహ్మ‌ణుల గురించి ఆమె పిలుపుతో వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు క‌దిలారు. వారంద‌రికీ స‌హాయం అందించి, విజ‌య‌మ్మని గౌర‌వించారు.

దానికి ముందు కూడా పలు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ప్ప‌టికీ ఎన్న‌డూ ప్ర‌చారానికి ప్రాధాన్య‌త‌నివ్వ‌లేదు. ముఖ్యంగా సేవా కార్య‌క్ర‌మాల్లో వైఎస్ విజ‌య‌మ్మ ఎన్నో విధాలా అభాగ్యుల‌కు తోడుగా ఉంటారు. పైగా త‌న కార్య‌క్ర‌మాల గురించి ప్ర‌చారం వ‌ద్ద‌ని చెబుతూ ఉంటారు. తాను తెర‌వెనుక ఉండి ఎంద‌రో పేద‌ల‌కు వారం వారం విజ‌య‌మ్మ అందించే సేవ‌ల గురించి వారి ఇంట్లో కూడా చాలా మందికి తెలియ‌దంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. హైద‌రాబాద్ , సికింద్రాబాద్ లోని ప‌లువురు ఫుట్ పాత్ మీద ఉండే పేద‌ల‌కు విజ‌య‌మ్మ నేరుగా స‌హాయం అందిస్తూ ఉంటారు. వారికి కంబ‌ళ్లు, ఆహారం పంపిణీ చేస్తూ ఉంటారు. ఆమె త‌రుపున కొంద‌రు స‌న్నిహితులు లోట‌స్ పాండ్ నుంచి వారం వారం వెళ్లి ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ ఉంటారు. ప్రతి ఆదివారం ఇలా దాదాపు వంద అన్నం పాకెట్లు, కంబళ్ళను పేదలకు దానం చేస్తారని, ప్రతీ వారం నగరంలోని ఒక్కో ప్రాంతానికి వెళ్ళి ఇలా ఇచ్చి వస్తుంటార‌ని ఈ సేవా కార్య‌క్ర‌మాల గురించి ఎదురుచూసే చాలామంది చెప్పే మాట‌.

పేద‌ల‌కు ఉచితంగా వైద్యం చేసిన డాక్ట‌ర్ గా గుర్తింపు పొందిన వైఎస్సార్ ఆత‌ర్వాత ఇడుపులపాయలో త‌న గురువు పేరుతో ప్రారంభించిన విద్యాసంస్థ ద్వారా ఏటా వేల మందికి ఉచితంగా కార్పోరేట్ స్థాయి విద్య‌ను అందిస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ఆ పాఠ‌శాల నిర్వ‌హ‌ణ‌ను కొన‌సాగిస్తున్నారు. వారికితోడుగా అటు హైద‌రాబాద్ లో, ఇటు తాడేప‌ల్లిలో విజ‌య‌మ్మ ఎక్క‌డ ఉన్నా గానీ వారం వారం సేవా కార్య‌క్ర‌మాలు కొన‌సాగించ‌డం మాత్రం ఆప‌లేదు. తాజాగా విజ‌య‌వాడ‌లో కృష్ణా న‌ది తీరంలో ఉన్న పేద‌ల‌కు క‌డుపు నింపే కార్య‌క్ర‌మాల‌ను కూడా ఆమె త‌ర‌చుగా చేప‌డుతున్నార‌ని చెబుతుంటారు. ఏమ‌యినా ఇలాంటి సేవా దృక్ప‌థంతో, అది కూడా ప్ర‌చారా ఆర్భాటాల‌కు దూరంగా నిర్వ‌హించ‌డం విజ‌య‌మ్మ స్వ‌భావాన్ని చాటుతోంది. ఈరోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న విజ‌య‌మ్మ ఇలాంటి మ‌రిన్ని సేవా కార్యక్ర‌మాల‌తో కొన‌సాగాల‌ని కోరుకుందాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి