iDreamPost

మరోసారి సత్తా చాటిని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

మరోసారి సత్తా చాటిని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

వైసీపీ యువనాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరోసారి తన సత్తాను నిరూపించుకున్నారు. నందికొట్కూరులో ఏ ఎన్నికైనా విజయం వైసీపీదేనని, పార్టీలో ఎన్ని వర్గాలు ఉన్నా.. తనదే పైచేయని మరోమారు చాటారు. తాజాగా వెలువడిన నందికొట్కూరు మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులతోపాటు, తన వర్గంగా స్వతంత్రగా పోటీ చేసిన వారిని బైరెడ్డి గెలిపించుకున్నారు. 29 వార్డులున్న నందికొట్కూరు మున్సిపాలిటీలో నాలుగు వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగతా 25 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి.

కౌన్సిలర్‌ సీట్ల విషయంలో ఎన్నికలకు ముందు వైసీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి, ఎమ్మెల్యే ఆర్థర్‌కు మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఎవరికి వారు తన వర్గం వారికి కౌన్సిలర్‌ సీట్లు దక్కాలని పట్టుబట్టారు. సీట్ల పంచాయతీ తర్వాత 29 వార్డుల్లో బైరెడ్డికి 19 వార్డులు, ఎమ్మెల్యే అర్థర్‌కు పది వార్డులు చొప్పన కేటాయించారు. తనకు ఇచ్చిన 19 వార్డుల్లోనూ పార్టీ అభ్యుర్థులను బైరెడ్డి గెలిపించుకున్నారు. మిగతా 10 వార్డులకు గాను 9 చోట్ల బైరెడ్డి వర్గీయులే స్వతంత్రులుగా బరిలో నిలిచారు. వారిలో 8 మంది గెలుపొందారు. మరొక వార్డులో ఎమ్మెల్యే ఆర్థర్‌ వర్గీయుడు గెలుపొందారు. మొత్తం మీద బైరెడ్డి వర్గీయులు మున్సిపాలిటీలో 27 వార్డుల్లో గెలిచారు. టీడీపీ కేవలం ఒక్క వార్డుకే పరిమితమైంది.

Also Read : సత్తా చాటిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు..

గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ బైరెడ్డి తన సత్తాను చాటారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని 77 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. అందులో 62 పంచాయతీల్లో వైసీపీ మద్ధతుదారులు జయకేతనం ఎగురవేశారు. ఒక చోట బీజేపీ, మిగతా చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. బైరెడ్డి సొంత గ్రామమైన పగిడ్యాల మండలం పాతముచ్చుమర్రిలో తొలిసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తన పెదనాన్న, బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి నిలబెట్టిన అభ్యర్థికీ పోటీగా అభ్యర్థిని దింపిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి.. 831 ఓట్ల మెజారిటీతో గెలిపించుకున్నారు.

ఎస్సీ రిజర్డ్వ్‌ నియోజకవర్గమైన నందికొట్కూరులో గత ఎన్నికల్లో ్ల వైసీపీ తరఫున పోటీ చేసిన ఆర్థర్‌ గెలిచారు. వైసీపీ విజయంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిదే ప్రధాన పాత్ర. ఎన్నికల ప్రచారం అంతా తానై నడిపించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బైరెడ్డికి, ఎమ్మెల్యే ఆర్థర్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. వీరిద్దరి మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. పంచాయతీ సర్పంచ్‌ సీట్ల విషయంలోనూ వివాదాలు చెలరేగాయి. పట్టుబట్టి తన వర్గం వారికి సర్పంచ్‌ సీట్లు సాధించుకున్న బైరెడ్డి.. వారిని గెలిపించి నియోజకవర్గంపై తనకున్న పట్టును నిరూపించుకున్నారు. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ తన వర్గం వారీని గెలిపించుకుని పల్లెల్లోనే కాదు పట్టణంలోనూ తనదే పైచేయి అని నిరూపించుకున్నారు.

Also Read : ఆశ్చర్యకరంగా మైదుకూరు ఫలితం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి