iDreamPost

థియేటర్ ప్రేమికులకు మంచి రోజులు

థియేటర్ ప్రేమికులకు మంచి రోజులు

ఎన్ని ఓటిటిలు వచ్చినా, టెక్నాలజీ ఎంత పెరిగినా బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కు అవేవి సాటిరావనే సంగతి ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. అందుకే డెబ్భై నుంచి వంద ఇంచుల దాకా స్మార్ట్ టీవీలు ఎన్ని వచ్చినా జనం థియేటర్ కు వచ్చి వినోదాన్ని పొందేందుకే ఇష్టపడుతున్నారు. సగటు మనిషికి ఇండియాలో వినోదమంటే మొదట కనిపించే ఆప్షన్ సినిమానే. తర్వాతే క్రికెట్ అయినా మరొకటి అయినా. అంతగా చొచ్చుకుపోయిన ఈ ఎంటర్ టైన్మెంట్ గత కొంత కాలంగా విపరీత టికెట్ ధరల వల్ల తీవ్ర ప్రభావం చెందుతోంది. ముఖ్యంగా మల్టీప్లెక్సు సంస్కృతి పెరిగాక మిడిల్ క్లాస్ వాడు థియేటర్ కు వెళ్లడమే తగ్గించేశాడు. ఇంట్లోనే సర్దుకుంటున్నాడు.


అలాంటి వాళ్ల కోసమే అన్నట్టుగా మొన్న సెప్టెంబర్ 23న నేషనల్ సినిమా డే సందర్భంగా కేవలం 75 రూపాయలకే టికెట్లు అమ్మడం అద్భుత ఫలితాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా సింగల్ డేలో ఏకంగా 65 లక్షల ఫుట్ ఫాల్స్ నమోదవ్వడం పెద్ద రికార్డు. మల్టీప్లెక్సు అసోసియేషన్ ఈ ఫలితాన్ని సీరియస్ గా విశ్లేషించింది. పబ్లిక్ కేవలం ఓటిటిల వల్లే థియేటర్లకు దూరం కాలేదని అర్థం చేసుకుంది. అందుబాటు ధరలు ఉంటే కుటుంబాలతో సహా వచ్చేందుకు లక్షలాది ఆడియన్స్ ఎదురు చూస్తున్నారని అర్థం చేసుకుంది. దీంతో మరికొద్దిరోజుల పాటు 26 నుంచి 29 దాకా కేవలం 100 రూపాయలకే అమ్మకాలు చేసేందుకు నిర్ణయించుకుంది.

ఇదో గొప్ప పరిణామం. దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్రహ్మాస్త్ర పార్ట్ 1, ధోకా డి కార్నర్, చుప్ ది రివెంజ్ అఫ్ ఆర్టిస్ట్ తదితర చిత్రాలను ఈ రేట్ కింద ఇవ్వబోతున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో సైతం 200 పైమాటే ఉన్న టికెట్ ని హాఫ్ రేట్ కే కొనుగోలు చేయొచ్చన్న మాట. దీనివల్ల వీక్ డేస్ లోనూ మంచి రద్దీ కనిపించే అవకాశాలు ఉన్నాయి. 30న శుక్రవారం పొన్నియన్ సెల్వన్ 1, విక్రమ్ వేదాలాంటి భారీ బడ్జెట్ మూవీస్ ఉండటం అక్కడితో ఈ వెసులుబాటుని ఆపేస్తారు. బాలీవుడ్ టాక్ ప్రకారం రాబోయే రోజుల్లో సైతం ఇలాంటి ఆఫర్స్ కొనగించేందుకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సుముఖంగా ఉన్నారట. ఇవే కదా మూవీ లవర్స్ కి మంచి రోజులంటే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి