iDreamPost

బాబు ఇంకా అక్కడే ఉన్నారు, జనమే ముందుకు పోతున్నారు

బాబు ఇంకా అక్కడే ఉన్నారు, జనమే ముందుకు పోతున్నారు

రాజకీయాలు స్థిరంగా ఉండవు. ఆ మాటకొస్తే సృష్టిలో ఏదీ శాశ్వతం కాదన్నది శాశ్వత సూత్రం. కానీ చంద్రబాబు మాత్రం తనే శాశ్వతం అనుకుంటారు. తాను నమ్ముతున్న పచ్చ మీడియా రాతలే నిజమనుకుంటారు. అందరినీ నమ్మించాలని చూస్తారు. ఇంకా చెప్పాలంటే నమ్మి తీరాల్సిందేనంటారు. కానీ పాపం పరిస్థితి అలాలేదు. గతంలో అయితే చంద్రబాబు వీరుడంటే జనాలకు వీరుడిలానే ఉండేది. నిప్పు అంటే అమ్మో నిప్పు అనుకునేలా కనిపించేది. కానీ సీన్ మారిపోయింది. జనంలో చాలామార్పులు వచ్చాయి. మీడియాలో అంతకుమించిన మార్పులు వచ్చేశాయి. ఫలితంగా చంద్రబాబుకి ఎంత ఎలివేషన్ ఇచ్చినా అది పనిచేయడం లేదు. వీరాధివీరుడంటూ ఆరున్నర శృతిలో ఆలపించినా జనం ఆదరించడం లేదు. ఫార్టీ ఇయర్ ఇండస్ట్రీ అని చెప్పినా పనికావడం లేదు.

ఇక అనివార్యంగా మళ్లీ పాత పాటనే అందుకుంటున్నారు. తమను ఆదరించే పరిస్థితి లేకపోవడంతో అధికారంలో ఉన్న జగన్ ని నిందించడమే మేలని డిసైడ్ అయ్యారు. పదే పదే జగన్ చుట్టూ అపోహలు, అర్థసత్యాలు ప్రచారం చేస్తే ఆఖరికి జనం వాటినే నమ్మితీరుతారని, లేదంటే నమ్మించే వరకూ పట్టువదలకూడదని బాబు అండ్ బ్యాచ్ డిసైడ్ అయ్యింది. జగన్ అవినీతిపరుడని కోర్టులో కేసులు వేశారు. కానీ వాటికి ఆధారాలు లేవని ఆనాడు ఈ కేసులు పెట్టిన అధికారులే ఇప్పుడు చెబుతున్నారు. జగన్ ఫ్యాక్షనిస్టు అన్నారు. గడిచిన మూడేళ్లుగా ఏపీలో ముఠాకక్షల గోల లేదని జనమే తెలుసుకున్నారు. ఇక ఇప్పుడు బాబాయ్ హత్య చుట్టూ రాజకీయం చేసి జగన్ మెడకు చుట్టాలనే సంకల్పంతో సాగుతున్నారు.

నిజానికి జగన్ మీద జనంలో ఉన్న అభిప్రాయం వేరు. చంద్రబాబు ఆశించింది వేరు. అందుకే జనంలో ఉన్న సదాభిప్రాయం చెరిపేసి చెడుగా ముద్రవేయాలనే సంకల్పంతో సాగుతున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు ఇలా అనేక విధాలుగా జగన్ మీద నిందలువేసి, నేరుగా చంద్రబాబు సైతం కుల, మత కోణాల్లో విమర్శలు చేసినా సామాన్యులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఇప్పుడు వైఎస్ కుటుంబంలో జరిగిన హత్య చుట్టూ రాజకీయం రాజేసి అందులోంచి చలిమంటలు కాచుకుందామనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. అందుకు అనుగుణంగా ఛార్జిషీట్ లో ఇచ్చిన సాక్ష్యాలను రోజూ అందంగా అల్లేసే పచ్చ మీడియా బరి తెగిస్తోంది.

గతంలో జగన్ అవినీతిపరుడు అంటూ ఇదే రీతిలో రోజూ ఫుల్ పేజీల రాతలు అచ్చేసేవారు. అదే పనిగా నెలల తరబడి ఈ క్యాంపెయిన్ చేశారు. లక్షకోట్లు కాదు..ఇంకా ఎన్నో లక్షలకోట్లు అంటూ బుక్ లెట్స్ కూడా వేసి పంచారు. కానీ చివరకు 12 వందల కోట్ల అవినీతి మీద కేసులు పెట్టి అందులో కూడా ఆధారాలు లేక ఈడీ, సీబీఐలు చతికిలపడ్డాయి. సరిగ్గా ఇప్పుడు అదే రీతిలో మీడియా పుంఖానుపుంఖాలుగా రాతలు రాస్తోంది. పదేళ్ల క్రితం సొంతంగా పార్టీ పెట్టుకున్న నాడు జగన్ ని ఏ రకంగా బద్నాం చేసేందుకు ప్రయత్నించారో సరిగ్గా అదే పంథాను అనుసరిస్తున్నారు. పాత పద్ధతుల్లోనే జగన్ మీద బురద పూసే పనికి ప్రాధాన్యతనిస్తున్నారు. పదే పదే అదే రీతిలో వివేకానంద హత్య చుట్టూ ఆతృత చాటుకుంటున్నారు. తద్వారా ప్రజలను నమ్మించగలమని భావిస్తున్నారు.

చంద్రబాబు కి అసలు సమస్య అక్కడే ఉంది. పదేళ్ల క్రితం ఇంత విస్తృతంగా సోషల్ మీడియా లేదు. చంద్రబాబు అండ్ కో చెప్పిందానికి కౌంటర్ ఇవ్వడానికి సాక్షి తప్ప మరో మార్గం లేదు. కానీ ఇప్పుడు మీడియా విస్తరించింది, సోషల్ మీడియా డామినేట్ చేస్తోంది. దాంతో బాబు అండ్ కో ప్రయత్నాలు పదే పదే బెడిసికొడుతున్నాయి. చివరకు సునీతమ్మ, ఆమె భర్త చాటున జగన్ ని దోషిని చేయాలని చూస్తే అదే సునీతమ్మ చెప్పిన మాటలు ఇప్పుడు బాబుకి బూమరాంగ్ అవుతున్నాయి. ఐదేళ్ల క్రితం ఆమె చెప్పిన మాటలకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు వాంగ్మూలం ఇవ్వడానికి కారణాలు ఏమిటనేది ప్రజలు ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఈ రీతిన ప్రభావితం చేసిన వాళ్ల గురించి ఆరాతీసేందుకు ఆస్కారమిస్తోంది. దాంతో చంద్రబాబు తానొకటి తలిస్తే దైవం మరోటి తలచిందన్నట్టుగా తల పట్టుకోవాల్సి వస్తోంది. ప్రజలు చాలా ముందుకెళ్లినా తానింకా పాత పద్ధతిలో వ్యక్తిత్వహనానికి పూనుకుంటే పనికాదన్నది అర్థం చేసుకోలేకపోవడమే ఈ దుస్థితికి కారణంగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి