iDreamPost

యాక్టివ్ గా ఉన్నది మీడియానా ? ప్రతిపక్షాలా ? ఎవరి మీద ఎవరు ఆధారపడ్డారు ?

యాక్టివ్ గా ఉన్నది మీడియానా ?  ప్రతిపక్షాలా ? ఎవరి మీద ఎవరు ఆధారపడ్డారు ?

ఇదే అనుమానాలు అందరిలోను పెరిగిపోతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు యాక్టివ్ గా ఉన్నాయా లేకపోతే ఎల్లోమీడియానే యాక్టివ్ గా ఉందా అనే విషయం మీద పెద్ద డిబేటే జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోరమైన ఓటమి తర్వాత తెలుగుదేశంపార్టీ దాదాపు నేలమట్టమైపోయినట్లే. అధినేత చంద్రబాబునాయుడు ఏదో మీడియాలో ప్రతిరోజు కనబడాలన్న దురదతోనే నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్న విషయం అర్ధమైపోతోంది.

టిడిపి పరిస్ధితే ఇలాగైపోతే ఇక మిగిలిన రాజకీయ పార్టీల పరిస్ధితి ఏమిటి ? ఏమిటంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోమాలోకి వెళ్ళిపోయింది. గతకాలపు వైభవాన్ని నెమరేసుకుంటూ ఆ పార్టీ నేతలు బతికేస్తున్నారు. వామపక్షాలను జనాలు పట్టించుకోవటం ఎప్పుడో మానేశారు. బిజెపి సంగతి గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఏకైక కారణంతోనే ఇక్కడి నేతలు చెలామణి అవుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో బిజెపిప్రభావం కూడ ఏమి లేదు.

ఇక జనసేన గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా ఎక్కువే అవుతుంది. ఎందుకంటే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబుకు అమ్ముడు పోయాడనే ఆరోపణలను జనాల్లో ముద్ర పడిపోయింది. అందుకనే పవన్ ఏమి మాట్లాడినా జనాలు అస్సలు రెస్పాండే కావటం లేదు. ఈ కారణంగానే మొన్నటి ఎన్నికల్లో స్వయంగా రెండు నియోజకవర్గాల్లో పోటి చేసిన పవనే ఓడిపోయాడంటేనే పార్టీ సంగతిని జనాలు ఎంత లైట్ గా తీసుకున్నారో అర్ధమైపోతోంది.

అంటే స్ధూలంగా రాష్ట్ర రాజకీయాలను చూస్తే అధికార వైసిపిని ఢీ కొనే శక్తి ప్రతిపక్షాల్లో దేనికి కూడా లేదన్న విషయం అర్ధమైపోతోంది. ఈ పరిస్ధితిలో జగన్ అంటే పడని ఎల్లోమీడియానే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాను ప్రతిపక్ష పాత్ర పోషించటంతో పాటు ప్రతిపక్షాలన్నింటినీ జగన్ కు వ్యతిరేకంగా పోరాటం చేయటానికి రెడీ చేస్తోంది. ఇక్కడ విచిత్రమేమిటంటే ఎల్లోమీడియా ఎంతగా జాకీలేస్తున్నా ప్రతిపక్షాల్లో ఒక్కటి కూడా జగన్ పై పోరాడ లేకపోతున్నాయి.

ఎల్లోమీడియా నుండి ఇంత మద్దతున్నా ప్రతిపక్షాలు ఎందుకు పోరాటం చేయలేకపోతున్నాయంటే జనాల్లో విశ్వసనీయత కోల్పోయాయి కాబట్టే. ప్రతిపక్షాలనే కాదు ఎల్లోమీడియా కెపాసిటి ఏమిటో మొన్నటి ఎన్నికల్లో బయటపడిపోయింది. ప్రజా ప్రయోజనాల కోసం జగన్ నిర్ణయాలు తీసుకుంటుంటే స్వప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా వాటిని అడ్డుకుంటోంది. స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియంను అడ్డుకోవటమే ఉదాహరణ.

ఇక తాజాగా కరోనా వైరస్ నియంత్రణ విషయంలో కూడా జగన్ ఏమి చేస్తున్నాడో చూస్తున్న జనాలు ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు. చంద్రబాబు, ప్రతిపక్షాల ఆరోపణలను జనాలు చాలా లైటుగా తీసుకుంటున్నారు. సోషల్ మీడియా ముందు ఎల్లోమీడియా ఎందుకూ పనికిరాకుండా పోతోంది.

జనాల విశ్వసనీయత కోల్పోయిన తర్వాత ప్రతిపక్షాలు విడివిడిగా వచ్చినా ఒకటే ఉమ్మడిగా వచ్చినా ఒకటే. అలాగే జనాలు నమ్మని ఎల్లోమీడియా ప్రతిపక్షాలకు ఎంత జాకీలేసినా మాత్రం ఉపయోగం ఏమిటి ? ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా తెలంగాణాలో చేతులెత్తేసినట్లే ఏపిలో కూడా తొందరలో అదే పరిస్ధితి వచ్చేస్తుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి