iDreamPost

అన్నీ ముఖ్యమంత్రే చేయాలి..! మరి మీరేం చేస్తారు ఎమ్మెల్యే గారు..??

అన్నీ ముఖ్యమంత్రే చేయాలి..!  మరి మీరేం చేస్తారు ఎమ్మెల్యే గారు..??

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ విధించిన ప్రభుత్వం, ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. ప్రభుత్వ విజ్ఞప్తిని అక్కడక్కడ ప్రజలు పట్టించుకోకున్నా.. ప్రజా ప్రతినిధులు మాత్రం బాగా వంటపట్టించుకున్నారు. బయటకు వస్తే ఎక్కడ ప్రాణాలు పోతాయోనన్న భయంతో ఇళ్లకే పరిమితమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఆపత్కాల సమయంలో తమ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. పారిశుధ్య కార్మికుల చేస్తున్న పనిని పర్యవేక్షించడం, సామాజికదూరం పాటిస్తున్నారో లేదో చూస్తూ కొంత మంది ప్రజా ప్రతినిధులు మీడియాకు ఫోజులిస్తూ తమ ప్రచార యావను తీర్చుకుంటున్నారు.

2014 ఎన్నికల్లోనూ, గడచిన సాధారణ ఎన్నికల్లోనూ వైఎస్‌ జగన్‌ ఛరిష్మా వల్లనే వైసీపీ అభ్యర్థులు గెలిచారనే విశ్లేషణలు అప్పట్లో సాగాయి. ప్రజా సంకల్ప పాదయాద్ర ద్వారా జగన్‌ తన పార్టీ అభ్యర్థులను గెలిపించారు. పార్టీ గ్రామ, పట్టణ స్థాయిలో నిర్మాణం, ప్రచారం ఎలా చేయాలి.? ఎప్పుడు ఏ కార్యక్రమం చేయాలి…? దాని పర్యవేక్షణ కోసం ప్రశాంత్‌ కిషోర్‌ టీంను ఏర్పాటు చేసుకున్నారు. వారు ఒత్తిడిలు చేస్తే తప్పా కమిటీలు, బూత్‌ ఇన్‌చార్జిలు కూడా వేయని అప్పటి కో ఆర్డినేటర్లుగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యేలైన వారు చాలా మంది ఉన్నారు. ఎన్నికల్లో జగన్‌ గెలిపించినా.. ఆ తర్వాత తమ నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని చూరగొనే ప్రయత్నాలు అధిక మంది శాసన సభ్యులు చేయడంలేదనేది నగ్న సత్యం. పల్లెల ముఖాలు చూడడమే మానేశారు. అందుకే పలువురు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఇప్పటికే మూటకట్టుకున్నారు.

ప్రజా వ్యతిరేకతను పొగొట్టుకునేందుకు, వారి అభిమానాన్ని చూరగొనేందుకు ప్రజా ప్రతినిధులకు కరోనా వైరస్‌ రూపంలో ఓ అవకాశం వచ్చింది. చేవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి లాంటి వారు మినహా మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలేదు. తన నియోజకవర్గంలోని పల్లెలు, పట్టణాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడం, తానున్నానే భరోసా ఇవ్వడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారు. అంతా సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తారులే అన్న రీతిలో వారున్నట్లుగా కనపడుతోంది.

కరోనాపై గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు పోరాటం చేస్తున్నారు. కరోనా వైరస్‌ను ఏపీలో సమర్థవంతంగా అరికట్టడంలో వాలంటీర్లదే కీలక పాత్ర. ఎప్పటికప్పుడు తమ పరిధిలోని ఇళ్లపై నిఘావేసి సమాచారం ప్రభుత్వానికి చేరవేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించారు. ఇప్పటికే రెండు సార్లు సర్వే చేసిన వాలంటీర్లు ఏపీలో 29 వేలకుపైగా విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారని గుర్తించారు. వారి వివరాలు, ఆరోగ్య సమాచారం యాప్‌లో నమోదు చేస్తూ ప్రభుత్వానికి నిమిషాల్లో సమాచారం ఇస్తున్నారు. ముచ్చటగా మూడోసారి కూడా సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్న వాలంటీర్లు తమ ఆరోగ్యాలనే ఫణంగా పెడుతున్నారని చెప్పవచ్చు. మాస్క్‌లు, గ్లౌజ్‌లు, ఇతర రక్షణ చర్యలు ఏమీ తీసుకోకుండానే వారు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. తగిన రక్షణ లేకుండానే కరోనా లక్షణాలున్న వారి వద్దకు వెళుతున్నారు. ఇలాంటి విపత్కర కాలంలో సమర్థవంతంగా సేవలందిస్తున్న వాలంటీర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిదులపై ఉంది. ఇందుకు వారు చేయాల్సింది కేవలం తమ పరిధిలోని వాలంటీర్లకు మాస్క్‌లు, గ్లౌజ్‌లు, సానిటైజర్లు పంపిణీ చేయడమే. ఇందుకు అయ్యే ఖర్చు.. వారు ఎన్నికల్లో పెట్టిన ఖర్చులో కనీసం ఐదు శాతం కూడా ఉండదు. లేదు మాస్క్‌లు, సానిటైజర్లు కూడా ప్రభుత్వమే ఇవ్వాలి… మాకేం సంబంధం లేదని ఇంట్లో మడికట్టుకుని కూర్చుంటే వచ్చే ఎన్నికల తర్వాత ఇళ్లలోనే కూర్చునేలా ప్రజలు తీర్పు ఇస్తారనే విషయం ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ గుర్తు పెట్టుకోవాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి