iDreamPost

అది పార్టీ ఆఫీసా లేక లిక్కర్ షాపా?

అది పార్టీ ఆఫీసా లేక లిక్కర్ షాపా?

ఏపీలో వాలంటీర్ల వ్య‌వ‌స్థ చుట్టూ వివాదం అల‌ముకుంటోంది. విప‌క్షం తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. పాల‌క‌ప‌క్షం అదే తీరులో తిప్పికొడుతోంది. దాంతో వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. తాజాగా నారా లోకేశ్, ఇత‌ర టీడీపీ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై అధికార పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ ప‌ర్స‌న్ ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు. ఆరోప‌ణ‌లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధ‌మంటూ స‌వాల్ కూడా చేశారు.

వాలంటీర్ల ద్వారా పెన్ష‌న్ల పంపిణీని కొత్త పంథాలో ప్ర‌భుత్వం చేప‌ట్టింది. ఒక్క రోజులోనే 54ల‌క్ష‌ల మందికి పించ‌న్లు అందించే ప్ర‌క్రియ కొత్త అధ్యాయంగా మారింది. ఈ నేప‌థ్యంలో కొంద‌రు వాలంట‌ర్లు చేసిన త‌ప్పిదాల ఆధారంగా వాలంట‌ర్లంద‌రిపై చేస్తున్న విమ‌ర్శ‌లే రాజ‌కీయ వివాదాలుగా మారుతున్నాయి. తాజాగా లిక్క‌ర్ బాటిళ్ల‌తో టీడీపీ ఆఫీసులో మీడియా స‌మావేశం నిర్వ‌హించిన బొండా ఉమా అలాంటి విమ‌ర్శ‌లే చేశారు. వాలంట‌ర్ల ద్వారా ఇంటింటికీ మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఏపీలో కొన్ని బ్రాండ్ల‌ను అమ్మ‌కుండా అడ్డుకుంటూ, జే ట్యాక్స్ వ‌సూలు చేస్తున్నార‌ని విమ‌ర్శించిన బొండా అదే క్ర‌మంలో వాలంటీర్ల మీద కూడా గురిపెట్టారు.

ఏపీలో మ‌ద్య విధానంప‌ట్ల ప్ర‌జ‌లంతా సంతృప్తిగా ఉన్న‌ప్ప‌టికీ టీడీపీ నేత‌ల‌కు మాత్రం మింగుడుప‌డ‌డం లేద‌ని రోజా కౌంట‌ర్ ఇచ్చారు. మ‌ద్యం సీసాల‌తో మీడియా స‌మావేశం పెట్టి టీడీపీ ఆఫీసుని లిక్క‌ర్ దుకాణంలా త‌యారు చేశార‌ని మండిప‌డ్డారు. వాలంట‌ర్ల ద్వారా మ‌ద్యం అమ్మ‌కాలు చేస్తున్నార‌ని చేసిన విమర్శ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. నిరూపించాల‌ని స‌వాల్ విసిరారు. అలా జ‌రిగితే తాను రాజీనామా చేస్తాన‌ని ఛాలెంజ్ చేశారు. లిక్క‌ర్ అమ్మ‌కాలు పెంచ‌డానికి టార్గెట్లు పెట్టిన చంద్ర‌బాబుకి, ఏటా 20 శాతం చొప్పున మ‌ద్యంపై నియంత్ర‌ణ‌కు పూనుకున్న జ‌గ‌న్ కి పోలిక లేద‌న్నారు. కానీ టీడీపీ నేత‌లు మాత్రం వాలంట‌ర్ల మీద విమ‌ర్శ‌లు చేస్తున్న తీరు సిగ్గు చేట‌న్నారు. రాబోయే స్థానిక ఎన్నిక‌ల్లో వారే బుద్ధి చెబుతార‌ని హెచ్చ‌రించారు. టీడీపీకి మ‌రోసారి ఘోర ప‌రాభ‌యం ఎదురుకాబోతోంద‌ని జోస్యం చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి