Idream media
Idream media
విలన్లు రెండు రకాలు. ఇంటి విలన్లు, డెన్ విలన్లు. ఇంటి విలన్లు ఎక్కువగా నాగభూషణం, సూర్యకాంతం, ఛాయాదేవి రూపంలో ఉంటారు. డెన్ విలన్లు సత్యనారాయణ, రాజనాల తదితరులు. సందర్భాన్ని బట్టి వాళ్లు వీళ్లవుతారు.
ఇంట్లో విలన్లు ఏం చేస్తారంటే తగాదాలు పెడతారు. హీరోని అవమానిస్తారు. హీరో హీరోయిన్లని విడదీస్తారు. రౌడీలతో కొట్టిస్తారు. భూములను ఆక్రమించడం, పంచాయతీ సొమ్ము తినడం…ఇలా ఉంటాయి వీళ్ల పనులు.
ఇక డెన్ విలన్లు. వాళ్ల రేంజ్ వేరు. స్మగ్లింగ్, బ్యాంక్ దోపిడీ, బాంబులు, తుపాకులు, సూట్‌కేసులు మార్చుకోవడం అన్నీ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్.
ఇన్ని తెలివితేటలున్న విలన్లు కూడా హీరో చేతిలో వెర్రివెంగళప్పలవుతారు. ఇది రూల్. దేశోద్ధారకులు సినిమాలో నాగభూషణం పెద్దపెద్ద డైలాగ్‌లు చెబుతూ ఉంటాడు. ఎన్టీఆర్ ఒక లుంగీ కట్టుకుని, బుగ్గన పులిపిరి కాయ అతికించుకుని వస్తే కనుక్కోలేడు. వేటగాడు సినిమాలో రావుగోపాలరావు ప్రాసతో కూడిన పంచ్‌లు వేస్తూ అదిరిపోయే ఎత్తుగడలు వేస్తాడు. ఎన్టీఆర్ ఒక కల్లుకుండ చేతిలో పట్టుకుని “హస్సిరవలి” అని ఏదో పిచ్చిభాష మాట్లాడితే చేతులు ఎత్తేస్తాడు. ఒక మనిషి విగ్గు పెట్టుకుని లుంగీ కట్టుకుని వస్తే కనుక్కోలేని వాడు వాడేం విలన్?
అడవిరాముడులో ఎన్టీఆర్ అరబ్ డ్రస్ వేసుకుని నల్లకళ్లద్దాలు పెట్టుకుంటే అతిపెద్ద స్మగ్లర్ నాగభూషణం తెల్లముఖంతో చూస్తాడు.
డెన్‌లో పెద్దపెద్ద చెక్క పెట్టెలు, నీళ్లడ్రమ్ములు అలంకరించి ఉంటాయి. ఇక వీళ్లు వాటితో ఏం చేస్తారో దేవుడికే తెలుసు. క్లైమాక్స్ ఫైటింగ్లో ఇవన్నీ పల్టీలు కొడతాయి.
విలన్ ఇంకో ప్రత్యేకత ఏమంటే హీరో దొరికినప్పుడు కాల్చి పడేయడు. పేజీల కొద్ది డైలాగ్‌లు చెప్పడమే కాకుండా వన్‌టూత్రీ అని లెక్కలు కూడా వేస్తాడు. ఈ లోగా హీరో ఏదో చేసి తప్పించుకుని విలన్ని చంపేస్తాడు. కనీసం ఈ విలన్లకు చావు తెలివితేటలు కూడా ఉండవు.
ఈ విలన్లు ఎన్టీఆర్‌ని, ఏఎన్ఆర్ని కనుక్కోలేదంటే OK. కానీ కృష్ణ మారువేషంలో ఉన్నా తెలుసుకోలేరు. కృష్ణ ఏ వేషం వేసినా ఒకటే యాక్షన్ కదా!
స్పెషాలిటీ ఏంటంటే వాళ్లకి ఈ డెన్లు, నీళ్ల డ్రమ్ముల సెట్టింగ్‌లు ఉండవు. సూర్యకాంతం సీన్లో ఉంటే ఎవరో ఒకరిని తిడుతూనే ఉంటుంది. చివరి సీన్లో బుద్ధి తెచ్చుకుంటుంది.దసరాబుల్లోడు సినిమాలో సూర్యకాంతంని ఎస్వీ రంగారావు కొరడాతో కొట్టే సీన్లో విజిల్స్ ఎందుకు పడతాయంటే అప్పటి వరకూ సూర్యకాంతం దౌర్జన్యాన్ని ప్రేక్షకుడు భరించాడు కాబట్టి.
చెడ్డవాళ్లకు శిక్షపడితే భలే ఆనందం మనకి. నాగభూషణం, రాజనాల ఎక్కడో సినిమాల్లో ఉంటారనుకుంటాం గానీ ఒక్కోసారి వాళ్లు మనింట్లోనే నాన్నలు, మామయ్యల రూపాల్లో ఉంటారు. గుర్తుపట్టలేం. అంతే!