iDreamPost

వీర ‘హింస’ రెడ్డి!

వీర ‘హింస’ రెడ్డి!

నందమూరి బాలకృష్ణ ఎంతో గొప్ప నటుడు. విభిన్న పాత్రలు పోషించి మెప్పించగలడు. ఆయన నటించిన ఆదిత్య 369, భైరవ ద్వీపం వంటి సినిమాల గురించి ఇప్పటికీ, ఎప్పటికీ మాట్లాడుకుంటారు. ఆ సినిమాలు, వాటిలో ఆయన నటన అంత గొప్పగా ఉంటాయి. కానీ కొన్నేళ్లుగా బాలయ్య సినిమా అంటే హింస ఉండాల్సిందే అనేలా మారిపోయింది. అవే ఫ్యాక్షన్ సినిమాలు, అవే నరుక్కోవడాలు.. సినిమాల్లో కొత్తదనమే ఉండట్లేదు. బాలకృష్ణ కొత్త కథల వైపు చూడట్లేదా? లేక దర్శకులు బాలయ్యని కొత్త కథల్లో చూపించాలి అనుకోవట్లేదో అర్థం కావట్లేదు. తాజాగా విడుదలైన వీరసింహారెడ్డి కూడా హింసతో నిండిపోయింది. కథాకథనాలతో సంబంధం లేకుండా బాలయ్య చేత కత్తో గొడ్డలో పట్టించి.. చేతులు, తలలు నరుక్కుంటూ పోతే చాలు.. ఫ్యాన్స్ చూస్తారు అనే భ్రమల్లో ఉండి ఈ సినిమా తీసినట్లుంది.

సాంఘిక, జానపద, పౌరాణిక ఇలా అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించగల అతి కొద్ది మంది నటుల్లో బాలకృష్ణ ఒకడు. ఆయన కెరీర్ స్టార్టింగ్ లో విభిన్న పాత్రలు, చిత్రాలతో అలరిస్తూ స్టార్ గా ఎదిగాడు. కానీ రెండు దశాబ్దాలుగా ఆయన ఫ్యాక్షన్ జపమే చేస్తున్నాడు. ఆయన ఐదు సినిమాల్లో నటిస్తే కనీసం మూడు సినిమాల్లో మితిమీరిన హింస ఉంటుంది. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు సినిమాల నుంచే ఈ బాట పట్టారని చెప్పొచ్చు. ఆ రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్ లు.. బాలయ్య క్రేజ్ ని అమాంతం పెంచాయి. కానీ బాలయ్యలోని వైవిధ్య నటుడిని తొక్కిపట్టి.. ఆయనను హింస వైపు పరుగెత్తేలా చేసినవి కూడా ఆ రెండు సినిమాలే. అప్పటినుంచి బాలయ్య ఎక్కువగా అలాంటి సినిమాలే చేస్తూ వచ్చాడు. దర్శకులు కూడా తొడలు కొట్టడం, ట్రైన్ లు ఆపడం వంటి సన్నివేశాలతో ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోయారు. దాంతో బాలయ్య కొన్నేళ్ల పాటు ట్రోల్ స్టఫ్ కూడా అయ్యాడు. ఈమధ్య గౌతమిపుత్ర శాతకర్ణి, అఖండ వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. వాటిలో కూడా హింస ఉన్నప్పటికీ.. దానికి ఒక లెక్క ఉంది. పైగా ఆ సినిమాల్లో కంటెంట్ ఉంది. అందుకే విజయం సాధించాయి. కానీ వీరసింహారెడ్డి అలా కాదు. బాలయ్య సినిమా అంటే దారుణమైన హింస ఉండాల్సిందే అని తీసినట్లుగా ఉంది.

వీరసింహారెడ్డి కథ రొటీన్ గా ఉంది. ఆ రొటీన్ కథని అంతకంటే రొటీన్ సన్నివేశాలతో నింపేసి.. పేలవమైన కథనంతో నడిపించారు. వీరసింహారెడ్డి పాత్ర గెటప్, బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్ మాత్రమే సినిమాకి బలంగా నిలిచాయి. అయితే యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్ ని మెప్పించేలా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. కానీ కొన్ని సన్నివేశాల్లో హింస మరీ మితి మీరిపోయింది. చేతులు, తలలు తెగి పడిపోతుంటాయి. ఈ సంక్రాంతికి కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా సినిమాలు చూస్తుంటారు. అలాంటిది పిల్లలను తీసుకొని ఇంత హింస ఉన్న సినిమాకి వెళ్ళగలరా. ప్రతిసారీ బాలయ్య కత్తి పట్టి నరికితేనే ఫ్యాన్స్ చూస్తారనుకోవడం కరెక్ట్ కాదు. విభిన్న చిత్రాలు తీయకుండా.. రొటీన్ ఫ్యాక్షన్ కథ తీసుకొని హింసతో నింపేసి ఫ్యాన్స్ ని ఎంజాయ్ చేయమంటే ఎలా?. ఇకనైనా ఇలా కేవలం హింసే కాకుండా.. బాలయ్యలోని అసలుసిసలు నటుడిని బయటపెట్టే సినిమాలు తీస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా చేస్తే ఖచ్చితంగా ఆయన అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పిస్తారు అనడంలో అనుమానమే లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి