iDreamPost

కోవిడ్ వ్యాక్సిన్ కొరతకు ఎగుమతులే ప్రధాన కారణమా..?

కోవిడ్ వ్యాక్సిన్ కొరతకు ఎగుమతులే ప్రధాన కారణమా..?

దేశంలో కోవిడ్ భయం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ పేరుతో కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత ఏడాది ఆగష్ట్, సెప్టెంబర్ స్థాయిలో ప్రస్తుతం కొత్త కేసులు వస్తున్నాయి. ఇది అందరినీ కలవరబరుస్తోంది. మహారాష్ట్రలో మరోసారి లాక్ డౌన్ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. అనేకమంది వలస కూలీలు మళ్లీ సొంతూళ్ల బాట పట్టారు. అదే సమయంలో ఏపీలో కూడా వారం రోజుల వ్యవధిలో కేసులు రెండు రెట్లు పెరిగాయి. తెలంగాణాలోనూ అదే తీరుగా ఉంది. దాంతో మరో ముప్పు సంకేతాలు సామాన్యులను తీవ్రంగా సతమతం చేస్తున్నాయి.

కరోనా నుంచి గట్టెక్కేందుకు తొలుత సంశయించినా ప్రస్తుతం అంతా వ్యాక్సిన్ కోసం పరుగులు పెడుతున్నారు. అత్యధికులు వ్యాక్సినేషన్ కి మొగ్గు చూపుతున్నారు. కానీ డిమాండ్ కి తగ్గట్టుగా వ్యాక్సిన్ సరఫరా లేకపోవడంతో చాలామందిని కలచివేస్తోంది. ముఖ్యంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. అందులో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మహారాష్ట్ర, జార్ఖండ్, చత్తీస్ ఘడ్, రాజస్తాన్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో వ్యాక్సిన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. ఇక ఏపీలో కూడా అనేక చోట్ల వ్యాక్సిన్ లభించడం లేదు. ప్రస్తుతం 45సం.లు పైబడిన వారందిరికీ వ్యాక్సిన్ అవకాశం ఉన్నప్పటికీ డోసులు లేకపోవడంతో చాలా మంది వెనుదిరగాల్సి వస్తోంది

గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా వ్యాక్సిన్ కోసం జనం బారులు తీరుతున్నారు. కానీ అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో తీసుకురాలేని స్థితి ఏర్పడింది. అదే సమయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా వివిధ దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతులకు కేంద్రం ప్రాధాన్యతనివ్వడం విమర్శలకు దారితీస్తోంది. కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై కేంద్రాన్ని వేలెత్తి చూపుతున్నారు. సోనియా, రాహుల్ సహా పంజాబ్ సీఎం కూడా ఈ రీతిలోనే వ్యాఖ్యలు చేశారు. ఎగుమతులకు ప్రాధాన్యతనిచ్చి దేశంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిని కేంద్రం ఖాతరు చేయడం లేదని వారు విమర్శించారు.

ముఖ్యంగా మొదటి డోసు వేసుకున్న వారికి రెండో డోసు అందుబాటులో లేకపోవడం మరో పెద్ద సమస్యగా కనిపిస్తోంది. ఏపీలో ప్రభుత్వం చొరవ తీసుకుని సచివాలయాల్లో వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేసింది. కానీ తీరా ఒంగోలు, నెల్లూరు వంటి ప్రాంతాల్లో వ్యాక్సిన్ సరఫరా లేకపోవడంతో ఆయా కేంద్రాలు మూతవేయాల్సి వస్తోంది. కేంద్రం చొరవ తీసుకోవడం లేదనే విమర్శలకు తావిస్తోంది. యూపీ, బీహార్ కి వ్యాక్సిన్ అందిస్తూ కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర కు మాత్రం నామమాత్రంగా వ్యాక్సిన్ సరఫరా చేయడం మరో వివాదం అవుతోంది. ఏమయినా ఈ విషయంలో మోడీ చొరవ చూపాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బెంగాల్ పై దృష్టి పెట్టిన కేంద్రం పెద్దలు ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనివ్వకపోతే కరోనా మరోసారి కలకలం రేపి కొత్త కష్టాలకు దారితీసే ముప్పు పొంచి ఉందని గ్రహించాలంటూ అంతా చెబుతున్నారు.

Also Read : కరోనా వ్యాక్సిన్ వేసుకొనిరండి.. ఉచితంగా బీరు తాగండి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి