iDreamPost

Upendra ఉపేంద్ర మిస్ చేసిన మెగా ఛాన్స్

Upendra ఉపేంద్ర మిస్ చేసిన మెగా ఛాన్స్

ఇప్పుడంటే తెలుగులో ఉపేంద్ర సినిమాలు తగ్గిపోయాయి కానీ 1998లో కన్నడ డబ్బింగ్ A వచ్చినప్పుడు రేగిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత తన పేరుని టైటిల్ గా పెట్టి చేసిన మరో మూవీ ఇంతే స్థాయిలో సూపర్ హిట్ అయ్యింది. చిత్రమైన శారీరక భాషతో, ముక్కుసూటిగా మాట్లాడే పాత్రల స్వభావాలతో తనకంటూ మంచి ఫాలోయింగ్ ని ఏర్పరుచుకున్నారు. వీటికన్నా ఎక్కువగా ఉపేంద్రకు దర్శకుడిగా గొప్ప ఖ్యాతి తెచ్చిన చిత్రం ఓం(1995). శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన ఈ ఇండస్ట్రీ హిట్ ఇండియాలోనే అత్యధికంగా రీ రిలీజులు దక్కించుకున్న సినిమాగా రికార్డు సాధించింది. 20 ఏళ్ళ తర్వాత పది కోట్లకు దీని శాటిలైట్ అమ్మారు.

ఈ ఓంనే తెలుగులో ఓంకారం పేరుతో రాజశేఖర్ హీరోగా ఉపేంద్ర తన డైరెక్షన్ లోనే రీమేక్ చేశారు. ప్రేమ హీరోయిన్ గా ఎల్బి శ్రీరామ్ సంభాషణలు సమకూర్చగా దాదాపు ప్రతి ఫ్రేమ్ ని మక్కికి మక్కి తీశారు. కానీ ఫలితం మాత్రం దానికి రివర్స్ వచ్చింది. మన ప్రేక్షకులు అంత వయొలెంట్ స్టోరీని రిసీవ్ చేసుకోలేకపోయారు. ఓం టైంలోనే ఉపేంద్ర పేరు మారుమ్రోగిపోయింది. తెలుగులోనూ ఆఫర్లు వచ్చాయి. నిర్మాత అశ్వినీదత్ చిరంజీవి హీరోగా ఓ ప్రాజెక్టు చేసేందుకు ప్రతిపాదన పంపారు. కానీ అప్పటికే ఉన్న కమిట్ మెంట్ల వల్ల ఉపేంద్ర ఆ అవకాశాన్ని వాడుకోలేకపోయారు. వదులుకోవాల్సి వచ్చింది. చిరు కెరీర్ డౌన్ లో ఉన్న సమయమది.

ఆ అవకాశాన్ని వాడుకుంటే కెరీర్ ఏ మలుపు తిరిగేదో కానీ ఉపేంద్ర ఇప్పటికీ దాని గురించి సారీ ఫీలవుతారు. నిన్న గని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దీన్ని మొదటిసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు. తెలుగులో కన్యాదానంలాంటి మంచి స్ట్రెయిట్ హిట్ మూవీస్ ఉన్నాయి ఉపేంద్రకు. నాగబాబుతో ఒకే మాటలో స్క్రీన్ షేర్ చేసుకుని ఇన్నేళ్ల తర్వాత తిరిగి వరుణ్ తేజ్ తో గనిలో కలిసి నటించడం విశేషం. ఆ మధ్య అల్లు అర్జున్ సన్ అఫ్ సత్యమూర్తితో రీ ఎంట్రీ ఇచ్చారు కానీ ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇటీవలే హోమ్ మినిస్టర్ గా కన్నడ ప్రేక్షకులను పలకరించిన ఉప్పి దాదా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. నెక్స్ట్ కబ్జా రిలీజ్ కు రెడీగా ఉంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి